గ్రంథాలయాలే సరస్వతి నిలయాలు -పుస్తక పఠనంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించండి -కవి సమ్మేళనంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి పిలుపు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : తిరుపతిలోని ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, సాహితీవేత్తలు, రీడర్స్, విద్యార్థినీ విద్యార్థులతో కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలనేవి సరస్వతి దేవి నిలయాలు, విజ్ఞాన భాండాగారాలన్నారు. వాటిలో ఉన్న పుస్తకాలను వినియోగించుకుని మంచి స్థాయిలో ఎదగాలని, మంచి పౌరులుగా సమాజానికి ఉపయోగపడాలని కోరారు. గ్రంథాలయ వారోత్సవాల ద్వారా గ్రంథాలయాల వల్ల జరిగే మేలును ప్రజలకు వివరించి, పాఠకులను ప్రోత్సహించేలా కృషి చేయాలన్నారు. విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనం వైపు మొగ్గు చూపాలని సూచించారు.తెలుగు వారి గొప్పదనాన్ని పద్యాలు, గేయాలు, ప్రాచీన సాంప్రదాయాలను కవిత రూపంలో తెలియపరచడమే గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కూడా గ్రంథాలయాలు వేదికలుగా ఉపయోగపడ్డాయనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో గ్రంథాలయాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మీకు కావాల్సిన వసతులు, కొత్త పుస్తకాల కొనుగోలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొత్త పుస్తకాలను పోటీ పరీక్షలకు వినియోగించుకుని యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. వారోత్సవాల సందర్భంగా హాజరైన కవులు, కళాకారులను గ్రంథాలయ సంస్థ తరఫున శాలువా కప్పి మెమొంటోతో చైర్మన్ గురువారెడ్డి సత్కరించారు. అదేవిధంగా చైర్మన్‌ను గ్రంథాలయ సిబ్బంది, సాహితీవేత్తలు, రీడర్స్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, గ్రంథాల అధికారి ధనంజయులు, పెద్ద ఎత్తున రీడర్స్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్