బోయిన రమేష్ దంపతులకు ప్రజల బ్రహ్మరథం
కోటబొమ్మాళి, నవంబరు 18, మేజర్ న్యూస్: కోటబొమ్మాళి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారం బుధవారం అత్యంత కోలాహలంగా, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో పర్యటించిన బోయిన రమేష్, మీరాబాయి దంపతులకు స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా మహిళలు మంగళ హారతులతో ఎదురేగి, నుదుటన తిలకం దిద్ది దంపతులను ఘనంగా సన్మానించారు. ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందన, అభిమానం చూస్తుంటే ఇది సాధారణ ఎన్నికల ప్రచారంలా కాకుండా ముందస్తు విజయోత్సవ ర్యాలీని తలపించే విధంగా సాగింది. ఈ సందర్భంగా బోయిన దంపతులు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు. రానున్న ఎన్నికల్లో మీరాబాయిని ఆశీర్వదించి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను పేరుపేరునా విన్నవించారు. గ్రామ అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో కొత్తమ్మతల్లి దేవాలయ పాలక మండలి అధ్యక్షుడు కోరాడ గోవిందరావు, ఎంపీటీసీ దేవాది సింహాద్రి, నాయకులు మజ్జి కృష్ణారావు, అచ్చయ్య రెడ్డి, మంగి రమణ, మెట్ట మోహనరావు, అనపాన శ్రీను తదితరులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.