అక్వాన్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి..
- రైతులు పంటల రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, నవంబరు 18, మేజర్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో ఫోన్‌లో మాట్లాడి జిల్లాలోని తాజా పరిస్థితులపై సమీక్షించారు. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు.
ముఖ్యంగా అన్నదాతలు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న వరి కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోసిన ధాన్యాన్ని కుప్పలుగా చేర్చి వర్షానికి తడవకుండా టార్పాలిన్లతో భద్రపరుచుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా వ్యవసాయ పనులు చేసుకోవాలన్నారు. తుపాను వేళ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రహదారులపై చెట్లు కూలినా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా తక్షణమే పునరుద్ధరించాలని, పునరావాస కేంద్రాలు, కంట్రోల్ రూములను సిద్ధంగా ఉంచి బాధితులకు తాగునీరు, ఆహారం, మందులు అందుబాటులో ఉంచాలని మంత్రి స్పష్టం చేశారు.