విద్యార్థుల స్కాలర్షిప్ సంగతేంటి...సారూ...! -ఫీజులతో సంబంధం లేకుండా సర్టీఫికేట్లు ఇవ్వాల్సిందే..
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ ఫార్మసీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్ షిప్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎస్ఎఫ్ఐ నేతలు ఆగ్రహం చేశారు. ఈ మేరకు బుధవారం ప్రిన్సిపాల్ ను కలిసి సమస్యను వివరించి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ వర్సిటీ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే అనేకమంది విద్యార్థులు ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకడమిక్ క్యాలెండర్ రూపకల్పన, అమలులో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని విమర్శించారు. దాదాపు 20 మంది విద్యార్థులకు రెండు నెలల పాటు జీరో అటెండెన్స్ నమోదు చేయడం వల్ల స్కాలర్షిప్లు నిలిచిపోయాయని మండిపడ్డారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించి విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు సంబంధిత విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని విద్యార్థులకు సర్టిఫికెట్లను జారీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి కళాశాల ఎదుట నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు అనిత, నాయకులు తిప్పేస్వామి, చరణ్, వర్షిత, లావణ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం రోడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్