నిబంధనలు గాలికి.. జనావాసాల మధ్యే వైన్‌షాప్!
∆. 40 రోజులైనా మారని దుకాణం
∆. అధికారుల మౌనం వెనుక మర్మమేమిటి?
∆. ప్రధాన రహదారి పక్కనే మద్యం విక్రయాలు, చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు
సంతబొమ్మాళి, నవంబర్ 18,మేజర్ న్యూస్ :
మండలంలోని నౌపడలో ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన వైన్‌షాప్ నిర్వహణ వివాదాస్పదంగా మారుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య, ప్రధాన రహదారిని ఆనుకుని మద్యం విక్రయాలు సాగిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాన్ని 15 రోజుల్లో మరోచోటుకు మారుస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చినప్పటికీ, సుమారు 40 రోజులు గడుస్తున్నా అదే ప్రాంతంలో కొనసాగుతుండటంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నౌపడ మెయిన్ రోడ్డును ఆనుకుని అక్టోబర్ 8వ తేదీన ఈ వైన్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. అయితే దుకాణం చుట్టుపక్కల బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోస్టాఫీస్, హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నాయి. అంతేకాకుండా సుమారు 50 మీటర్ల దూరంలోనే నౌపడ పోలీస్‌స్టేషన్ ఉంది. ఈ ప్రాంతంలో నిత్యం విద్యార్థులు, మహిళలు, రోగులు, ఉద్యోగులు, సాధారణ ప్రజల రాకపోకలు కొనసాగుతుంటాయి. ఇలాంటి రద్దీ ప్రాంతంలో వైన్‌షాప్ నిర్వహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు.
వైన్‌షాప్ ఏర్పాటు సమయంలో 15 రోజుల్లో మరో అనువైన ప్రాంతానికి మారుస్తామని నిర్వాహకులు చెప్పినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే గడువు ముగిసి మరో 25 రోజులు అదనంగా గడిచినా దుకాణాన్ని తరలించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం రహదారికి 250 మీటర్ల దూరంలో దుకాణం ఉండాలన్న నిబంధన ఉందని స్థానికులు చెబుతూ, ప్రధాన రహదారి పక్కనే విక్రయాలు ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
అధికారుల మౌనం ఎందుకు? :-
ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిసినా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటివరకు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు నిలదీస్తున్నారు. నిబంధనల అమలు బాధ్యత కలిగిన అధికారులే ఈ వ్యవహారంపై దృష్టి సారించకపోతే సామాన్య ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైన్‌షాప్ అనుమతులు, స్థల నిబంధనలు, నిర్వహణ తీరుపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనల ఉల్లంఘన ఉన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని నౌపడ గ్రామస్థులు కోరుతున్నారు.