అక్రమ మద్యం రవాణాపై జిల్లా అధికారుల కొరడా!
హిందూపురం :- రాబోయే ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం రవాణా, విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక నిఘా పెంచారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎస్.కె.డి.వి. ప్రసాద్, పుట్టపర్తి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి. నరసింహులు హిందూపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌తో పాటు తూముకుంట, కొడికొండ చెక్‌పోస్టుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ముందుగా తూముకుంట చెక్‌పోస్ట్‌ను సందర్శించిన అధికారులు, అక్కడ జరుగుతున్న వాహనాల తనిఖీలను పరిశీలించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమంగా మద్యం రవాణా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. చెక్‌పోస్ట్ మీదుగా వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని స్పష్టం చేశారు. అనంతరం కొడికొండ చెక్‌పోస్ట్‌లోనూ తనిఖీలు నిర్వహించి, సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం రవాణా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.
మిథనాల్ కర్మాగారాల పరిశీలన
తూముకుంట ప్రాంతంలోని మిథనాల్ కర్మాగారాలను సందర్శించిన అధికారులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం హిందూపురం ఎక్సైజ్ స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలపై సమీక్ష నిర్వహించారు.
రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా జరగకుండా నిరంతర నిఘా కొనసాగించాలని, అక్రమ మద్యం నిల్వలు, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో నిబంధనల ప్రకారం బైండోవర్ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
తనిఖీల్లో పలు కేసుల నమోదు
హిందూపురం పట్టణంలోని కల్లు డిపోను తనిఖీ చేసిన అధికారులు నమూనాలు సేకరించారు. అక్రమంగా కల్లు కలిగి ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న ఐదు యూనిట్ల కల్లును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాల మద్యానికి సంబంధించి 11 కేసులు నమోదు చేసి, 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుల్లో 38.09 లీటర్ల మద్యం, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినందుకు ఐదు కేసులు నమోదు చేయగా, 34 బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.అలాగే తొమ్మిది మద్యం నమూనాలు, 24 కల్లు నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం రవాణా, విక్రయాలను అరికట్టేందుకు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు, అనుమానాస్పద వాహనాలపై నిరంతరం నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎక్సైజ్ లక్ష్మీ దుర్గయ్య, కొడికొండ ఎక్స్చేంజ్ ఎస్ఐ కె విజయ్ కుమార్ తనిఖీలలో పాల్గొన్నారు.
హిందూపురం సూర్య స్టాఫ్ రిపోర్టర్ నాగేంద్ర