andhrapradesh
అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త..
హైదరాబాద్/అమరావతి, నవంబర్ 21: అగ్రిగోల్డ్ బాధితులకు నేర పరిశోధన విభాగం (సీఐడీ) కీలక శుభవార్త అందించింది. రూ. 447 కోట్ల అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో కీలక ముందడుగు వేస్తూ, బాధితుల అసలు బాండ్ల పరిశీలనకు (వెరిఫికేషన్) సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను సీఐడీ శనివారం విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.65 లక్షల మంది బాధితులను సీఐడీ ఇప్పటికే గుర్తించగా, వారి డిపాజిట్ బాండ్లను తనిఖీ చేసేందుకు జిల్లాలు, మండలాల వారీగా తేదీలను ఖరారు చేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక వెరిఫికేషన్ కేంద్రాల్లో బాండ్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. బాధితులు తమకు కేటాయించిన తేదీల్లో సంబంధిత వెరిఫికేషన్ కేంద్రాలకు అసలు బాండ్లు, అవసరమైన గుర్తింపు పత్రాలతో హాజరుకావాలని సీఐడీ అధికారులు సూచించారు. కాగా, ఈ రూ. 447 కోట్ల మోసానికి సంబంధించిన కేసులో సీఐడీ అధికారులు ఇప్పటికే ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజా వెరిఫికేషన్ ప్రక్రియతో తమకు న్యాయం జరిగి డిపాజిట్ సొమ్ము తిరిగి వస్తుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.