వితంతు పెన్షన్ మంజూరుకు లంచం.. ఏసీబీ వలలో లక్ష్మీపూర్ పంచాయతీ కార్యదర్శి
సూర్య - మానకొండూర్ : వితంతు పెన్షన్ మంజూరు చేసినందుకు ప్రతిఫలంగా ఓ వ్యక్తి వద్ద రూ. 10 వేలు లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావుడ్యా చవాన్ లాల్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి కోడలికి ‘ చేయూత (వితంతు) పెన్షన్’ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి, పెన్షన్ మంజూరు చేయించినందుకు పంచాయతీ కార్యదర్శి లావుడ్యా చవాన్ లాల్ రూ. 10,000 లంచం డిమాండ్ చేశారని తెలిపారు.లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో వల పన్నామని డీఎస్పీ పేర్కొన్నారు. శనివారం ఫిర్యాదుదారుడి నివాసంలోనే రూ. 10,000 నగదును లంచంగా తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని చెప్పారు. నిందితుడి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నామని, తన అధికారిక హోదాను దుర్వినియోగం చేసినందుకు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడిని కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ మహేందర్ రెడ్డి వివరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. అలాగే వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్‌బుక్ ద్వారా కూడా సమాచారం అందించవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.