ఆత్మకూరు అభివృద్ధికి 107కోట్లతో పనులు
*ఆత్మకూరు అభివృద్ధికి రూ.107 కోట్లతో పనులు*
*--రూ.29 కోట్లతో మరో 167 అభివృద్ధి పనులకు శ్రీకారం*
--రూ.20 కోట్లతో సమగ్ర క్రీడా కేంద్రం.. రూ.2 కోట్లతో నగరవనం*
*స్థానిక సంస్థల ఎన్నికలకు మూడు పార్టీల సమన్వయంతో సిద్ధం
-- మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*
ఆత్మకూరు,మేజర్ న్యూస్, సోమ వెంకటసుబ్బయ్య :
ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. 2024లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సహకారంతో ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే రూ.107 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, వీటిలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల పనులు దాదాపు పూర్తికావచ్చాయని వివరించారు.
ఆదివారం రాత్రి ఆత్మకూరు ఆర్ అండ్ బి అతిథిగృహంలో మంత్రి ఆనం పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రూ.50,000 కోట్ల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) రహదారి ప్రాజెక్టులో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీకి మరో రూ.29 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. ఈ నిధులతో చేపట్టనున్న 167 అభివృద్ధి పనులకు సంబంధించి అక్టోబర్ 12వ తేదీన మూడు విడతల్లో భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు పేరారెడ్డిపల్లి ప్రాంతంలో 25, 26, 27వ వార్డుల్లో, ఉదయం 11 గంటలకు నలంద స్కూల్ ప్రాంతంలో 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12, 13, 24వ వార్డుల్లో, సాయంత్రం 4 గంటలకు టెక్కే వీధి ప్రాంతంలో 10, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23వ వార్డుల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అక్టోబర్ 13వ తేదీ ఉదయం 11 గంటలకు అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి రవితేజ కల్యాణ మండపం వరకు 2.2 కిలోమీటర్ల మేర నిర్మించనున్న నాలుగు లేన్ల రహదారి పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా భూమిపూజ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సుమారు రూ.8.91 కోట్లతో చేపడుతున్న ఈ రహదారికి సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు.
ఆత్మకూరు తాగునీటి సమస్య పరిష్కారానికి సోమశిల నుంచి నీటిని సరఫరా చేసే కొత్త పైప్‌లైన్ల నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. పట్టణంలో సుమారు రూ.2 కోట్లతో నగరవనం ఏర్పాటు చేయనున్నామని, పడమర వైపు నుంచి జాతీయ రహదారిని సోమశిల మార్గంతో అనుసంధానించేలా కొత్త బైపాస్ రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత రెండేళ్లలో ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.100 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయని, రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఆత్మకూరు యువత, మహిళలకు ఉపయోగపడేలా 20 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.20 కోట్లతో సమగ్ర క్రీడా కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. గతంలో క్రీడా మైదానం కోసం కేటాయించిన తొమ్మిది ఎకరాలకు అదనంగా మరో 11 ఎకరాలను కలిపి ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా బాలికల కోసం గురుకుల పాఠశాలను మంజూరు చేయడంతో పాటు, ఈ ఏడాది దానికి జూనియర్ కళాశాల సదుపాయాన్ని కూడా కల్పించినట్లు తెలిపారు.
సంగంలోని ఐటీఐని ఆధునిక భవనాల్లోకి మార్చేందుకు చర్యలు చేపట్టామని, బిర్లా కంపెనీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఖనిజ నిధుల సహకారంతో సుమారు రూ.11.5 కోట్లతో లగడపాటి ఫౌండేషన్ అందించిన భవనాలను ఆధునీకరించి ఐటీఐని అక్కడికి తరలించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మరో మూడు, నాలుగు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విద్యతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్కుల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై మంత్రి మాట్లాడుతూ, రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ప్రక్రియ ఖరారైన అనంతరం మూడు పార్టీల నాయకత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా సీట్ల సర్దుబాటు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర నాయకత్వం, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తారని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తోందని మంత్రి ఆరోపించారు. ఎన్నికలు నిర్వహించకపోతే 16వ ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలకు రావాల్సిన సుమారు రూ.12,000 కోట్ల నుంచి రూ.16,000 కోట్ల నిధులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. గతంలో జరిగిన తప్పిదాల కారణంగా ఇప్పటికే సుమారు రూ.6,000 కోట్ల నిధులు నిలిచిపోయాయని పేర్కొన్నారు.
ఆత్మకూరు అభివృద్ధి, విద్యా విస్తరణ, క్రీడా సదుపాయాలు, తాగునీటి సమస్య పరిష్కారం, రహదారుల నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్లడంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు తాళ్లూరు గిరినాయుడు, తుమ్మల చంద్రా రెడ్డి, జనసేన నాయకుడు నలిశెట్టి శ్రీధర్, బిజెపి నాయకుడు కుడుముల సుధాకర్ రెడ్డి, పలువురు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.