ఆక్వా ఎక్స్ పోను సందర్శించిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
ఉండి, మేజర్ న్యూస్: రైతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి, ఆక్వా సాగులో మెరుగైన దిగుబడులు సాధిస్తూ లాభాల బాటలో నడిపించేందుకు ఆక్వా ఎక్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలోని రాధాకృష్ణ ఫంక్షన్ హాల్‌లో ఆక్వా ఎక్స్పో పౌండర్ అండ్ చైర్మన్ దంతులూరి వేణు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆక్వా ఎక్స్ ఎగ్జిబిషన్ రెండో రోజు కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించి, ఆక్వా రంగంలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన పరికరాలు, నాణ్యమైన మేత, చేపలు, రొయ్యల పెంపకంలో అనుసరించాల్సిన ఆధునిక పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆక్వా రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను రైతులకు పరిచయం చేయడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతోపాటు నాణ్యతను పెంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, వ్యాధుల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రైతులు మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు.ఆక్వా రంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం ఎంతో అవసరమని, ఇటువంటి ప్రదర్శనలు రైతులకు, ఆక్వా రంగ నిపుణులకు, పరిశ్రమల ప్రతినిధులకు మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఆక్వా రంగ అభివృద్ధికి, రైతుల ఆదాయం పెంపునకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆక్వా ఎక్స్పో నిర్వాహకులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో సమీర్ మేనేజింగ్ డైరెక్టర్, తేజ సాయి ఆక్వా ఎక్స్ సీఈవో, సందీప్ ఆక్వా ఎక్స్ డైరెక్టర్ తో పాటు వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ఆక్వా రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
న్యూస్ బ్యూరో కే బాల సౌరి ఏలూరు