వృద్ధులకు రూ.4 వేల టోకరా..ఫించన్ 4వేలకు మరో రూ.2 వేలు ఇస్తామంటూ మోసం
సూర్య,జూలూరుపాడు,వృద్ధాప్య పింఛన్ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తున్న ఇద్దరు వృద్ధులను గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలతో మోసం చేసి రూ.4 వేల నగదుతో ఉడాయించిన ఘటన సోమవారం జూలూరుపాడులో చోటుచేసుకుంది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన గంజి కనకమ్మ, కొల్లి జగన్నాధం తమ బ్యాంకు ఖాతాల్లో జమ అయిన వృద్ధాప్య పింఛన్ డబ్బులను తీసుకునేందుకు సోమవారం జూలూరుపాడులోని ఎస్‌బీఐ బ్యాంకుకు వచ్చారు.నగదు డ్రా చేసుకుని బ్యాంకు నుంచి బయటకు వస్తుండగా,హెల్మెట్ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వారి వద్దకు వచ్చాడు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త పథకం ప్రవేశపెట్టారని, పింఛన్‌గా వచ్చిన రూ.4 వేలతో పాటు అదనంగా మరో రూ.2 వేలు కలిపి ఇస్తున్నారని వృద్దులను నమ్మబలికించాడు.చిల్లర తీసుకొస్తానంటూ వృద్ధుల వద్ద ఉన్న రూ.4 వేల నగదును తీసుకుని ద్విచక్రవాహనంపై అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఎంతసేపటికీ సదరు వ్యక్తి తిరిగి రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన వృద్ధులు గంజి కనకమ్మ,కొల్లి జగన్నాధం తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నా
గుర్తుతెలియని వ్యక్తుల మాటలు నమ్మి నగదును వారి చేతుల్లో పెట్టవద్దని,ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు,సామాజిక మాధ్యమాల ద్వారా పలుమార్లు సూచిస్తున్నప్పటికీ ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.ముఖ్యంగా బ్యాంకుల నుంచి నగదు తీసుకుని బయటకు వచ్చే వృద్ధులు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. కష్టపడి పొందిన పింఛన్ డబ్బులు మోసగాళ్ల చేతిలో పోవడంతో బాధిత వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు.
సూర్య రిపోర్టర్ సిద్దిక్ జూలూరుపాడు