ఆరేళ్ల బాలిక మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు –నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు: ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు
ఒంగోలు, మేజర్‌న్యూస్ : నాగులుప్పలపాడు మండలంలోని సోమవారం సుమారు తెల్లవారు జామున ఆరు సంవత్సరాల పాప మృతి చెందిన ఘటనలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీయస్.,గారు GGH మార్చురీ లో ఉన్న బాలిక మృతి దేహమును పరిశీలించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని జిల్లా ఎస్పీ గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత సాక్ష్యాధారాలను సేకరించి, నిందితుడిని త్వరితగతిన అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా కేసులో పకడ్బందీగా దర్యాప్తు నిర్వహించి, సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా గౌరవ న్యాయస్థానంలో సాక్ష్యాలు సమర్పించి, నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. జీజీహెచ్ డాక్టర్ లు కిరణ్ కుమార్,వరుణ్ తేజ గార్లతో పాటు, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి ఏ. పద్మ సునంద గారితో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలిక మృతి చెందిన ఘటనకు సంబంధించిన వైద్యపరమైన అంశాలు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, సంబంధిత వివరాలపై చర్చించారు.