వాల్మీకి మహర్షి ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం: కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌తో కలిసి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలకు ప్రతీకగా నిలిచిందన్నారు. ఆయన బోధనలు సత్యం, ధర్మం, న్యాయం, మానవీయ విలువలతో కూడిన జీవన మార్గంలో నడిచేందుకు సమాజానికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వం, సామాజిక సామరస్యం, సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుటూరు, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్డీఏ అధికారి శ్రీనివాస్, డీపీఓ జయసుధ, బీసీ సంక్షేమ అధికారి మాధవ రెడ్డి, జయపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.