ధర్మబద్ధమైన మార్గంలో నడవడమే వాల్మీకి మహర్షికి నిజమైన నివాళి. జిల్లా కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట: ధర్మబద్ధంగా జీవిస్తూ, మంచి మార్గంలో పయనించడమే వాల్మీకి మహర్షి జీవితమిచ్చిన గొప్ప సందేశమని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భారతీయ సాహిత్యంలో ఆదికావ్యంగా పేరుగాంచిన రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన రచించిన రామాయణం తరతరాలకు ధర్మం, నీతి, మానవీయ విలువలను బోధిస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రామాయణాన్ని చదివి, అందులోని ఆదర్శాలను తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు.
జ్ఞానోదయంతో జీవితంలో మార్పు
ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో జ్ఞానోదయం కలిగి, తన ఆలోచనలను మార్చుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి జీవితాన్ని పరిశీలిస్తే, ఎవరైనా తమ జీవితంలో మార్పు తెచ్చుకుని ఉన్నతమైన మార్గంలో పయనించవచ్చనే విషయం స్పష్టమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ, మంచి మార్గంలో నడవాలని సూచించారు.వాల్మీకి మహర్షి రచనలు ఎందరో రచయితలకు, కవులకు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. పెద్దబాలశిక్ష వంటి పుస్తకాల ద్వారా అనేక అంశాలపై జ్ఞానాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం, వారి ఆదర్శాలను అనుసరించడం నేటి తరానికి ఎంతో అవసరమని కలెక్టర్ హైమావతి అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, ఎస్డీసీ సుదర్శన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రమేష్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సయ్యద్ రఫీ, ఏవో రాజ్‌కుమార్, బీసీ సంఘాల నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.