విష్ణు సహస్రనామ పారాయణంలో గిన్నిస్ రికార్డ్: ముచ్చింతల్‌లో భక్తిపారవశ్యం
హైదరాబాద్:హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో జరిగిన యతీంద్ర సప్తతి వేడుకలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లాయి. ఈ మహోత్సవంలో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించిన బృహత్ "విరాట్ విష్ణు సహస్రనామ పారాయణం" అరుదైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించింది. శ్రీరామనగర దివ్య ప్రాంగణంలో భక్తి పారవశ్యంతో సాగిన ఈ పారాయణంలో 5,000 మందికి పైగా భక్తులు ఏకకాలంలో పాల్గొని, ఏకకంఠంతో శ్లోకాలను పఠించారు. సమాజ శ్రేయస్సు, లోక కళ్యాణం లక్ష్యంగా సాగిన ఈ విరాట్ పారాయణంలో భక్తుల వేద ఘోషతో ముచ్చింతల్ క్షేత్రం మైమరిపించింది. ఈ చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఘట్టం గిన్నిస్ రికార్డుగా నమోదు కావడంపై మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. చిన్నజీయర్ స్వామివారి దివ్య మార్గదర్శనం, వేలాది మంది భక్తుల క్రమశిక్షణతో కూడిన ఏకాగ్రతే ఈ మహోన్నత విజయాన్ని సాకారం చేసిందని ఆయన కొనియాడారు.