అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం
సూర్య ప్రతినిధి (ఆరోగ్యం): అండాల సేకరణ పేరుతో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 44 ఏఆర్టీ కేంద్రాలకు గాను ఇప్పటివరకు 27 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించగా, ఏడు ఆసుపత్రుల్లో 13 నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ వ్యవహారంలో 31 మంది మహిళలను గుర్తించగా, వైద్యులు, ఐవీఎఫ్ కేంద్రాలు, మధ్యవర్తుల పాత్రపై విచారణ కొనసాగుతోంది. మిగిలిన కేంద్రాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల స్వాధీనంలోని రికార్డులు, జాతీయ ఏఆర్టీ అండ్ సరోగసీ రిజిస్ట్రీ నుంచి అందే సమాచారాన్ని పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు నవంబర్ 6న వైద్యాధికారులు న్యూఢిల్లీలోని జాతీయ రిజిస్ట్రీని సందర్శించి తెలంగాణలోని ఏఆర్టీ కేంద్రాలు, బ్యాంకుల వివరాలు కోరారు. ఏఆర్టీ చట్టం–2021 ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా అండాల సేకరణ శిక్షార్హమైన నేరమని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. మహిళలు మధ్యవర్తుల ప్రలోభాలకు లోనుకావద్దని, అక్రమాలు గుర్తిస్తే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.