టిక్‌టాక్ నిషేధంపై స్పెయిన్ యోచన: చిన్నారుల వీడియోలపై దుమారం
సూర్య అంతర్జాతీయ డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌పై దేశవ్యాప్తంగా నిషేధం లేదా తాత్కాలిక నిలుపుదల (సస్పెన్షన్) విధించే దిశగా స్పెయిన్ ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. టిక్‌టాక్‌లో మైనర్ పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ విచ్చలవిడిగా ప్రసారమవుతోందని ఒక స్వతంత్ర పరిశోధనా సంస్థ సంచలన నివేదికను బయటపెట్టడంతో పెను ప్రకంపనలు చెలరేగాయి. స్పెయిన్‌కు చెందిన పరిశోధక సంస్థ 'మాల్దితా' నిర్వహించిన 35 రోజుల ప్రత్యేక పరిశీలనలో, ప్లాట్‌ఫామ్‌పై చిన్నారుల లైంగిక వేధింపుల దృశ్యాలతో కూడిన 1,180కి పైగా పబ్లిక్ వీడియోలు ఉన్నట్లు తేలింది. వీటికి ఏకంగా 4.8 కోట్లకు పైగా వ్యూస్ రావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
డార్క్ వెబ్‌లో మాత్రమే కనిపించే అత్యంత హేయమైన కంటెంట్ టిక్‌టాక్ వంటి బహిరంగ సోషల్ మీడియా వేదికల్లో యథేచ్ఛగా చక్కర్లు కొడుతోందని, దాదాపు 20 వేల మంది అనుమానిత పెడోఫైల్ ప్రొఫైళ్లు ప్లాట్‌ఫామ్‌లో యాక్టివ్‌గా ఉన్నాయని పరిశోధకులు నిగ్గుతేల్చారు. ముఖ్యంగా 17 దేశాలకు చెందిన మైనర్ల లైవ్‌స్ట్రీమింగ్‌ల సమయంలో వీక్షకులు వర్చువల్ బహుమతులు, నగదు ఎరవేసి చిన్నారులను వేధింపులకు గురిచేస్తున్నారని, టిక్‌టాక్ రికమండేషన్ అల్గారిథమ్‌లు సైతం ఇటువంటి చట్టవిరుద్ధ ఖాతాలను చేరవేయడంలో తోడ్పడుతున్నాయని దర్యాప్తు బృందం ఆరోపించింది. అక్రమ కంటెంట్‌పై తాము ఫిర్యాదు చేసినప్పటికీ సంస్థ సరైన సమయంలో వాటిని తొలగించడంలో విఫలమైందని పరిశోధకులు ఆధారాలతో సహా వెల్లడించారు.
ఈ నివేదిక తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న స్పెయిన్ యువజన మరియు బాలల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించింది. చిన్నారుల ప్రాథమిక హక్కులు, రక్షణకు భంగం కలిగించే ఈ పరిణామాలను అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ, కేసును సమగ్ర విచారణ నిమిత్తం దేశ అటార్నీ జనరల్ కార్యాలయానికి (ప్రాసిక్యూషన్) బదిలీ చేసింది. సంస్థ బాధ్యతా రాహిత్యంపై వివరణ కోరేందుకు టిక్‌టాక్ ప్రతినిధులతో అత్యవసర సమావేశానికి మంత్రి సిరా రెగో ఆదేశించారు. పరిస్థితి సమీక్ష అనంతరం పిల్లల రక్షణ చర్యలలో లోపాలు రుజువైతే దేశంలో టిక్‌టాక్ సేవలను పూర్తిగా నిలిపివేయడంపై (సస్పెన్షన్) తుది నిర్ణయం తీసుకుంటామని స్పెయిన్ స్పష్టం చేసింది.