విషాదం: కరెంట్ వైరు పడి వ్యక్తి సజీవదహనం..
సంగారెడ్డి :సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దేగులవాడి గ్రామంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జరప్ప అనే వ్యక్తి తన ఇంటి ముందు నిద్రిస్తుండగా, విద్యుత్ వైరు తెగి పడటంతో ఆయన అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
అయితే, ఈ ఘటనపై జరప్ప కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది విద్యుత్ ప్రమాదం కాదని, ఎవరో కావాలనే ఆయనను హత్య చేసి, అనంతరం కరెంట్ వైరు పడినట్లు చిత్రీకరిస్తూ నిప్పంటించారని ఆరోపిస్తున్నారు. ఈ అనుమానాస్పద మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జరప్ప కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.