బేగంపేట్ లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు - పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ
బేగంపేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ కస్టమ్ బస్తీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ అడపా ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ కోట నీలిమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవిస్తూ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం మరెన్నో సంవత్సరాలు అంకితభావంతో సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ క్రమంలో డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. పేదలు, మహిళలు, రైతులు, యువత, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జనరంజక పాలన సాగుతోందని అన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం బస్తీలో విధులు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే పారిశుధ్య కార్మికులకు అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావించాలని అన్నారు. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.