రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి. : పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలి. : టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రామచంద్రరెడ్డి. :
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి :
ఆర్టీసీ కార్మికులకు గత ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు, డీఏలు, అలవెన్సులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రామచంద్రరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
దాదాపు 20 వేల మంది రిటైర్డ్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థిక ప్రయోజనాలు అందక 400 మందికి పైగా మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. RPS-2017, RPS-2021 వేతన సవరణ బకాయిలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ కార్మికులకు తార్నాక ఆసుపత్రి వైద్య పరిమితిని రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచడంతోపాటు సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు.
ఆర్టీసీ కార్మికులపై అధికారుల వేధింపులు పెరిగాయని, సిబ్బంది కొరతతో పని భారం అధికమైందని పేర్కొన్నారు. సెలవులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ విలీనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రయాణికుల నుంచి కార్మికులకు రక్షణ కల్పించేలా 'ప్రవళిక' పేరుతో కొత్త చట్టం తీసుకురావాలని ఏ.రామచంద్రరెడ్డి డిమాండ్ చేశారు.