బ్యాటరీ రేసులో భారత్: రూ.2,814 కోట్లతో రిఫైనరీల ఏర్పాటు
సూర్య బిజినెస్ డెస్క్: ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), గ్రీన్ ఎనర్జీ రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా అంతర్జాతీయ బ్యాటరీ సప్లై చైన్ రేసులోకి భారత్ దూకుడుగా అడుగుపెట్టింది. బ్యాటరీ తయారీలో అత్యంత సంక్లిష్టమైన 'మిడిల్ ప్రాసెసింగ్' (శుద్ధి ప్రక్రియ) లోటును భర్తీ చేసేందుకు వీలుగా రూ.2,814 కోట్ల మూలధన మద్దతు పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశంలో రెండు లిథియం, రెండు నికెల్ ప్రాసెసింగ్ రిఫైనరీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా చైనా గుత్తాధిపత్యంలో ఉన్న కీలక ఖనిజాల శుద్ధి రంగాన్ని ఛేదించి, దేశీయంగా బలమైన మౌలిక వసతులను నిర్మించేందుకు ఈ భారీ వ్యూహాన్ని కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.
ఈ పథకం 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఐదేళ్ల పాటు అమలులో ఉంటుంది. కొత్తగా ఏర్పాటయ్యే ఈ నాలుగు రిఫైనరీల నిర్మాణ వ్యయంలో 30 శాతం వరకు మూలధన సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది. ఇందులో ఒక్కో లిథియం ప్రాసెసింగ్ ప్లాంట్‌కు గరిష్టంగా రూ.500 కోట్లు, నికెల్ ప్లాంట్‌కు గరిష్టంగా రూ.900 కోట్ల వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. లిథియం ప్లాంట్లకు వార్షికంగా కనీసం 30,000 టన్నుల సామర్థ్యం, నికెల్ యూనిట్లకు కనీసం 50,000 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యం తప్పనిసరిగా ఉండాలని గనుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రభుత్వ మద్దతు ద్వారా పరిశ్రమ నుంచి దాదాపు రూ.10,000 కోట్ల మేర ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించవచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం భారత్‌లో బ్యాటరీ సెల్ అసెంబ్లింగ్ యూనిట్లు ఉన్నప్పటికీ, గనుల నుంచి తీసే ముడి ఖనిజాన్ని బ్యాటరీ-గ్రేడ్ రసాయనాలుగా మార్చే కమర్షియల్ రిఫైనరీలు లేవు. ఫలితంగా శుద్ధి చేసిన లిథియం, నికెల్, కోబాల్ట్ దిగుమతుల కోసం దేశం దాదాపు పూర్తిగా చైనాపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనా విధిస్తున్న ఎగుమతి నియంత్రణల నేపథ్యంలో స్వదేశీ రిఫైనరీలు ఏర్పాటైతే దేశీయ ఈవీ తయారీదారులకు ముడిసరుకుల భద్రత లభిస్తుంది. అయితే రిఫైనరీల స్థాపనతో పాటే ముడి ఖనిజ సరఫరా కోసం ఆస్ట్రేలియా, ఇండోనేషియా, అర్జెంటీనా వంటి దేశాలతో గనుల ఒప్పందాలు కుదుర్చుకోవడం మరియు ప్రాసెసింగ్ సాంకేతికతను సమకూర్చుకోవడం భారత్ ముందున్న ప్రధాన సవాళ్లుగా నిపుణులు పేర్కొంటున్నారు.