తెలంగాణలో మొదలైన చలి పంజా: 14.7 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
హైదరాబాద్, సూర్య న్యూస్ నెట్వర్క్ :తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ప్రజలు తీవ్ర చలికి గురవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14.7 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా చలి ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ రాత్రి వేళల్లో 17 డిగ్రీల నుంచి 19 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.