విద్యారంగానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయం
మెదక్, ; విద్యా వైతాళికుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 1923లో కేవలం 35 సంవత్సరాల వయసులోనే అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీకి అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎన్నికయ్యారని గుర్తుచేశారు. ఆయన జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి, విద్యా సంస్కరణలకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆధునిక విద్యా విధానాలు, విద్యా ప్రణాళికల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అప్పటివరకు అమలులో ఉన్న విద్యా విధానాల్లో మార్పులు తీసుకువచ్చి, దేశ అవసరాలకు అనుగుణంగా నూతన విద్యా విధానానికి పునాదులు వేశారని తెలిపారు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, దేశభక్తి, విద్యారంగానికి ఆయన అందించిన సేవలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మౌలానా ఆజాద్ ఎలాంటి స్వార్థం లేకుండా తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని, ఎన్నో సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని గుర్తుచేశారు. దేశానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, వివిధ శాఖల సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.