వెట్టి చాకిరీ నిర్మూలనే లక్ష్యం.. అవగాహన వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: సమాజంలో వెట్టి చాకిరీ వంటి అమానవీయ విధానాలను పూర్తిగా నిర్మూలించి, బాధితులకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాండెడ్ లేబర్ (వెట్టి చాకిరీ) నిర్మూలన ప్రత్యేక ప్రచార వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేయడం, చట్టాలను నిష్పక్షపాతంగా అమలు చేస్తూ బాధితులకు న్యాయం అందించడం, సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు నిబద్ధతతో పనిచేయడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేశారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… వెట్టి చాకిరీ వంటి అమానవీయ విధానాలకు సమాజంలో ఎలాంటి చోటు ఉండకూడదని స్పష్టం చేశారు. వెట్టి చాకిరీకి గురవుతున్న బాధితులను గుర్తించి వారికి విముక్తి కల్పించడంతో పాటు, పునరావాసం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా తగిన సహాయం అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాధితుల హక్కులను పరిరక్షిస్తూ వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రత్యేక ప్రచార వాహనం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వెట్టి చాకిరీ నిర్మూలన, బాధితుల హక్కులు, సంబంధిత చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా వెట్టి చాకిరీ ఘటనలు చోటుచేసుకున్నా, బాధితులు తమ దృష్టికి వచ్చినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. మానవ హక్కులను గౌరవిస్తూ వెట్టి చాకిరీ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుటూరు, కార్మిక శాఖ అధికారి వాల్య నాయక్, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు మాధవరెడ్డి, జయపాల్ రెడ్డి, హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.