వరి నారుతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెట్టు సాయి
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ మరోసారి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని, పొలంలో వరి నారుతో ముఖ్యమంత్రి చిత్రపటాన్ని రూపొందించి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వరి నారుతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రాన్ని రూపొందించేందుకు రైతులు సుమారు 20 రోజుల పాటు శ్రమించారు. ముఖ్యమంత్రి రైతులకు చేసిన రుణమాఫీకి కృతజ్ఞతగా తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. పొలంలోనే వరి నారుతో రూపొందించిన సీఎం చిత్రపటాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. రైతుల శ్రమ, అభిమానాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ చిత్రపటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రైతులతో కలిసి కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.