telangana
వైభవంగా అంకురార్పణ పూజా నిర్వహణ
సూర్య,భీమ్‌గల్ : భీమ్‌గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమన్నింబాచల క్షేత్రంపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అంకురార్పణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, వైదిక సంప్రదాయాల ప్రకారం ఘనంగా నిర్వహించారు.ఉత్సవాల నిర్విఘ్నంగా ప్రారంభం కావాలని సంకల్పిస్తూ ముందుగా స్వామివారి గర్భాలయంలో విశ్వక్సేన పూజ నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకిలో కల్యాణ మండపానికి తీసుకువచ్చి పుణ్యాహవచనం, రక్షాబంధనం, శ్రీమద్భగవద్గీత పారాయణం తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు.అనంతరం శాస్త్రోక్తంగా పుట్టమన్ను సేకరించి, ద్వాదశ పాత్రల్లో బీజాలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజాలు మొలకెత్తే ప్రక్రియ ద్వారా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. స్వామివారి ఉత్సవాలు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా, సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తూ ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి కుటుంబ సభ్యులు, అర్చక బృందం పాల్గొన్నారు.