ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలి: సీఐ జి. ప్రసాద్ రావు.
ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలి: సీఐ జి. ప్రసాద్ రావు.
రొంపిచెర్ల, మేజర్ న్యూస్: మండలంలో అన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కల్లూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. ప్రసాద్ రావు కోరారు. సోమవారం రొంపిచెర్ల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎస్. మధుసూదన్ రెడ్డితో కలిసి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ జి. ప్రసాద్ రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు అవసరమైన అన్ని ధ్రువపత్రాలు, రికార్డులతో నామినేషన్ కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎన్నికల నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీవో ఎస్. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ కోసం అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో నిర్ణీత సమయపాలన పాటిస్తూ, అవసరమైన అన్ని ధ్రువపత్రాలు, సరైన రికార్డులతో కేంద్రాలకు రావాలని సూచించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో రొంపిచెర్ల సబ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.