పొదలకూరులో ఘనంగా కోటి సోమవారం వేడుకలు..
పొదలకూరు, మేజర్ న్యూస్ : కార్తీక మాసం సందర్భంగా పొదలకూరులోని కామాక్షి తాయి రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి సోమవారం వేడుకలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.కార్తీక మాసంలో సోమవారానికి విశేష ప్రాధాన్యత ఉండటంతో భక్తులు శివనామస్మరణ చేస్తూ ఆలయానికి తరలివచ్చారు.మహిళా భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి భక్తితో ప్రత్యేక దీపారాధనలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పీబీఎస్వీ ప్రసాద్ స్వామి, అర్చకులు కుమారస్వామి ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోని రామలింగేశ్వర స్వామి, కామాక్షి అమ్మవారు, విఘ్నేశ్వర స్వామి, అయ్యప్ప స్వామివార్లను దర్శించుకుని పూజలు చేశారు. కోటి సోమవారం వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మార్మోగాయి.కోటి సోమవారం సందర్భంగా ఆలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొదలకూరు సిఐ వెంకట్రావు, ఎస్ఐ శివ రాకేష్ ల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.