రైతాంగాన్ని పీడిస్తున్న కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం
పొదలకూరు, మేజర్ న్యూస్ : కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. రైతులకు సాగునీరు, ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. సోమవారం మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో పర్యటించిన ఆయన స్థానిక రైతులు, గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి పాలనలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదని, రైతులు, నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉపాధి అవకాశాలు కనిపించడం లేదని విమర్శించారు. గ్రామాల్లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం
నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాల నీటిపై రైతులకు హక్కులు ఉన్నాయని, ముఖ్యంగా కండలేరు పరివాహక ప్రాంతంలోని మనుబోలు మండల రైతులు తరతరాలుగా ఆ నీటితో వరి సాగు చేస్తున్నారని కాకాణి తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాగునీటి కోసం ప్రశ్నించిన నాయకులు.. అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు వచ్చిన సమయంలో సోమశిల మీదుగా కండలేరుకు నీటిని తరలించి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. నెల్లూరు డెల్టా రైతుల నీటి హక్కులను కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు.
యూరియా కోసం రైతుల అవస్థలు
బోరుబావుల కింద సాగు చేసుకుందామన్నా యూరియా అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎరువుల డీలర్లను క్రిమినల్ కేసుల పేరుతో భయపెట్టే పరిస్థితి నెలకొందని విమర్శించారు. రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులకు సాగునీటితో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
74 టీఎంసీల నీటితో 1.80 లక్షల ఎకరాలే సాగు!
సోమశిల, కండలేరు జలాశయాల నీటి వినియోగంపై కాకాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. 74 టీఎంసీల నీటిని వినియోగించినప్పటికీ కేవలం 1.80 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట సాగు జరిగిందని పేర్కొన్నారు. సుమారు 18 టీఎంసీల నీటితో సాగు చేయగలిగే పంటలకు అదనంగా 56 టీఎంసీల నీటిని వృథా చేశారని ఆరోపించారు. నీటి వినియోగంపై సమగ్ర ప్రణాళిక లేకపోవడం వల్లే రైతులకు సాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయని విమర్శించారు.వెంటనే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించి సాగునీరు అందించాలని కోరారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.రైతుల సమస్యలను పరిష్కరించకపోతే వైఎస్సార్‌సీపీ వారి పక్షాన పోరాటం చేస్తుందని కాకాణి స్పష్టం చేశారు. అనంతరం మడమనూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకుడు విష్ణు మాతృమూర్తి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.