తెలంగాణ కళాకారుల హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ
కళాకారుల అభ్యున్నతికి ఇండస్ట్రీ కృషి.. సిరిసిల్ల వేదికగా ప్రభుత్వానికి వినతి
హైదరాబాద్: తెలంగాణ కళాకారుల అభ్యున్నతి, హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ ఫోక్ అసోసియేషన్, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఏర్పాటయ్యాయని తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క తెలిపారు.
గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నవంబర్ 3వ తేదీన సిరిసిల్ల పట్టణ కేంద్రంలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో తెలంగాణ ఫోక్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకల్లో తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కళాకారుల జీవితాల్లో ఆశించిన మార్పు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులను కేవలం కార్మికులుగా మాత్రమే కాకుండా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే సాంస్కృతిక ప్రతినిధులుగా గుర్తించాలని కోరారు. తెలుగు సినీ పరిశ్రమ తరహాలో తెలంగాణ కళాకారుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ ఫోక్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కళాకారులకు సంక్షేమ పథకాలు కల్పించాలి
తెలంగాణలో కళనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న కళాకారులను ప్రభుత్వం గుర్తించి వారికి సామాజిక భద్రత కల్పించాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
- అర్హులైన కళాకారులకు నెలవారీ పెన్షన్ సదుపాయం కల్పించాలి.
- నిరుపేద కళాకారులకు ఇళ్ల స్థలాలు, గృహ వసతి కల్పించాలి.
- కళాకారుల ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలి.
- నిరుపేద కళాకారుల పిల్లలకు ఉచిత విద్య అందించాలి.
- కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానాలను రూపొందించి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి.
తెలంగాణ సంస్కృతిలో కళాకారుల పాత్ర ఎంతో కీలకమని, వారి జీవనోపాధి, సంక్షేమం, భవిష్యత్తుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు.
కళాకారుల ఐక్యతతోనే హక్కుల సాధన
రాబోయే రోజుల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ ఫోక్ అసోసియేషన్, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కళాకారుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వానికి చేరే వరకు ఐక్యంగా నిరంతర పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణలోని కళాకారులందరికీ తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ సభ్యత్వం కల్పించేందుకు కృషి చేస్తున్నామని, 24 క్రాఫ్ట్‌లకు చెందిన కళాకారులందరూ తెలంగాణ ఫోక్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. కళాకారులంతా ఐక్యంగా ఉంటే తమ హక్కులను సాధించుకోవచ్చని, వారి సంక్షేమం కోసం తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ నిరంతరం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ కార్యవర్గ సభ్యులు, గౌరవ సలహాదారు దరువు అంజన్న, అభినయ శ్రీనివాస్, గజ్వేల్ వేణు, కోదారి శ్రీనివాస్, మల్లిక్ తేజ, జ్ఞానేశ్వర్, కోడం సంతోష్, ఘనశ్యామ్, వస్పరి విష్ణు, సంతోష్, బోడ చంద్రప్రకాష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.