ఆర్నబ్ తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి*
సూర్య, అశ్వరావుపేట,ఆర్నబ్ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పంటలపై ఏర్పడిన ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఈరోజు జిల్లా వ్యవసాయ అధికారి బాబు రావు గారు పంట పొలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా గుమ్మడి వల్లి ,కోయ రంగాపురం,నారాయణ పురం,అనంతారం,గాండ్ల గూడెం,నంది పాడు తదితర గ్రామాల్లో, వరి ,పత్తి, మినుము తదితర పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులకు పలు సూచనలు చేశారు.
వరి పంటలో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కోతకు సిద్ధంగా ఉన్న పంటను వాతావరణ పరిస్థితులను గమనించి కోయాలని సూచించారు. పత్తి పంటలో తేమ కారణంగా నాణ్యత దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
మినుము పంటలో అధిక వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండకుండా పొలంలో మురుగు నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటలో వేరుకుళ్లు, ఇతర తెగుళ్ల లక్షణాలను గమనించాలని, పంట పరిస్థితిని బట్టి వ్యవసాయ అధికారుల సలహా మేరకు నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు ,మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఏఈఓ లు రవీంద్ర,భాను,సతీష్ మరియు రైతులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట