కావలి డిఎస్‌పి కార్యాలయంలో ఘనంగా రక్తదాన శిబిరం.
కావలి మేజర్ న్యూస్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ (పోలీస్ ఫ్లాగ్ డే) వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా గురువారం కావలి పట్టణంలోని డిఎస్పీ (DSP) కార్యాలయ ఆవరణలో బృహత్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులతో పాటు సిబ్బంది, పట్టణ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కావలి డి.ఎస్.పి వి.వి. రమణ కుమార్ మాట్లాడుతూ, అమరులైన పోలీస్ జవాన్ల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. 1959 అక్టోబర్ 21న అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చొరబాటుదారులైన విదేశీ ముష్కరులు జరిపిన దాడిలో 11 మంది సిఆర్పిఎఫ్ (CRPF) జవాన్లు వీరమరణం పొందారని గుర్తుచేశారు. వారి అమరత్వానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలోనే కాకుండా, సమాజ సేవలోనూ పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని, అందులో భాగంగానే ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసినవారవుతారని పేర్కొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో స్థానిక సిఐలు గుడి రాజేశ్వరరావు, వై. రంగనాథ్ గౌడ్, శ్రీనివాసులు, అలాగే ఎస్ఐలు సుమన్, గోపీనాథ్, భాషా, వెంకటేశ్వర్లుతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని పలువురు పోలీస్ సిబ్బంది, స్థానిక యువకులు పాల్గొని రక్తాన్ని సేకరించేందుకు సహకరించారు. సేకరించిన రక్తాన్ని అత్యవసర వైద్య సేవలకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు.