గ్రామాల్లో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ పరిశీలన
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని రుద్రారం, కొండాపూర్ గ్రామాల్లో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ క్రిష్టియన్ గురువారం పర్యటించి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును పరిశీలించారు.ఆమె ఈ నెల 16వ తేదీ వరకు మండలంలో ఉంటూ వివిధ గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ శాఖల పనితీరు,ప్రజలకు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. గురువారం ఆమె పర్యటన సందర్భంగా మండల రుద్రారం కొండాపూర్ గ్రామాలలోని పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించిఉపాధ్యాయుల హాజరు,బోధనా పద్ధతులు,విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులను పరిశీలించారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు,వారికి అందుతున్న పౌష్టికాహారం,రికార్డుల నిర్వహణను పరిశీలించారు.ఆరోగ్య ఉపకేంద్రాలను సందర్శించి వైద్య సేవలు,మందుల లభ్యతపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జరుగుతున్న సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు.పంచాయతీ కార్యాలయాల రోజువారీ విధులు,రికార్డుల నిర్వహణ,గ్రామాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సునీత,ఎంపీడీవో జయరాం నాయక్,సర్పంచులు రవీందర్,రాఘవేందర్,పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.