తగ్గేదేలే...! *కార్పొరేషన్ లో పెరిగిన హీట్
విజయనగరం బ్యూరో, సూర్య : విజయనగరం కార్పొరేషన్ పోలింగుకు సమయం సపీపిస్తున్నకొద్దీ రాజకీయం హీటెక్కుతోంది. కారణాలు ఏవైనప్పటికీ, ప్రచారంలో ప్రస్తుతానికి వైసీపీదే పైచేయిగా కనిపిస్తోంది. టీడీపీ మాత్రం పలు కారణాల వల్ల కాస్త వెనుకబడింది. నోటిఫికేషన్ వెలువడేనాటికే వైసీపీ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణి ఖరారైపోవడం, ప్రచారానికి శ్రీకారం చుట్టేయడం జరిగిపోయాయి. ఆమె క్షేత్రస్థాయిలో క్యాంపెయినింగ్ చేస్తే, తండ్రి కోలగట్ల తెరవెనుక వ్యూహాలకు పదునుపెట్టేశారు. మొత్తంగా, శ్రావణి నగరం నలుమూలలా చుట్టేయడం, రెండో రౌండ్ ప్రారంభించేయడం ఒకదానివెంట ఒకటిగా జరిగిపోయాయి. నామినేషన్ దాఖలు చేశాక ఆమె బొత్స ఝాన్సీలక్ష్మిని స్వయంగా అమె నివాసంలో కలుసుకొని ఆశీర్వాదం తీసుకోవడం వెనుక కోలగట్ల వ్యూహం సుస్పష్టం. ఆ తర్వాత ఆమె ప్రచారంలో వెనుదిరిగి చూడడం లేదు. కేడర్ బలంగా ఉన్న డివిజన్లకు వ్యూహాత్మకంగా ద్వితీయ ప్రాధాన్యమిచ్చి, కాస్త బలహీనంగా ఉన్న డివిజన్లపై ఫోకస్ పెట్టారు. డిప్యూటీ మేయర్ గా పనిచేసిన అనుభవం ఆమెకు కలిసొస్తోంది. శ్రావణి క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తుంటే, కోలగట్ల తన నివాసంలో రాజకీయ కూడికలు, తీసివేతల్లో బిజీగా ఉంటున్నారు.ఇక, కూటమి అభ్యర్థి అవనాపు భార్గవి అభ్యర్థిత్వంపై చివరివరకు సస్పెన్స్ కొనసాగడంతో ప్రచారబరిలోకి ఆలస్యంగా దిగాల్సి వచ్చింది. సీట్ల సర్దుబాటులో కూటమి భాగస్వామ్య పార్టీలమధ్య పంచాయతీఎంత ఉత్కంఠకు గురిచేసిందీ తెలిసిందే. లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చినట్టుగా ప్రచారబరిలోకి దిగాక పర్వాలేదనిపించే స్థాయిలో తమదైన శైలిలో దూసుకువెళ్తున్నప్పటికీ శ్రావణి వేగాన్ని అందుకోలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే చెప్పాలి. పట్టుబట్టిమరీ పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే అంత ఈజీగా తీసుకుంటారని అనుకోలేం. మంత్రి శ్రీనివాస్ సహా పలువురు పార్టీనేతలు ఆమెకు అండగా నిలిచి ఆమె తరపున ప్రచారం చేస్తుండడాన్ని తేలిగ్గా తీసుకోలేం. ఇంకోవైపు, కొన్ని కారణాల రీత్యా దూరంగా ఉంటున్న అవనాపు విక్రమ్ తన అన్న విజయ్ తో చేతులు కలిపి భార్గవి గెలుపు బాధ్యతను భుజాన వేసుకోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయమే. టీడీపీ, జనసేన మధ్య మొదట్లో ఉన్న విభేదాలు క్రమంగా సమసిపోతున్న సంకేతాలను ఇప్పుడు ఆరెండు పార్టీలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కొంతవరకూ సానుకూల పరిణామంగా పేర్కొనవచ్చు.బీజేపీ కూడా కలసిరావడంతో మెల్లమెల్లగా అవనాపు భార్గవి ప్రచారంలో స్పీడ్ కనిపిస్తోంది. దీంతో, కోలగట్ల శ్రావణి కూడా మరింత వేగం పెంచారు. డివిజన్లవారీగా ఓటర్లను కలిసే ప్రయత్నం ముమ్మరం చేశారు. అవనాపు భార్గవి తరపున కూటమి నాయకులు తగ్గేదేలే అన్నట్టుగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. డివిజన్లలో ఆయా ప్రాంత నాయకులు, కేడర్ భార్గవి తరపున విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. ఇంకోవైపు, తటస్థులపై గురిపెట్టడం గమనార్హం. భార్గవి గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే అదితి అన్నిరకాల శక్తియుక్తులు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో, కోలగట్ల కూడా తన అనుభవాన్ని రంగరించి కుమార్తె విజయానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.ఇప్పటి పరిస్థితిని బేరీజు వేసుకొని చూస్తే, గెలుపు ఎవరికీ అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాఉంటే, పైడితల్లి జాతర, అర్ణబ్ తుపాన్ కారణంగా ప్రచారానికి కొంత విరామం ఇవ్వకతప్పలేదని ప్రజలు అనుకోవచ్చునుగానీ, రెండుపార్టీలూ తెరవెనుక ప్రచారాన్ని మాత్రం బాగానే చేశాయి. ఏఏ వర్గాలను ఎలా ఆకట్టుకోవాలో లెక్కలు వేసుకొనిమరీ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదపడంలో పోటీపడ్డాయి.మరోవైపు, అనుకూల సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారంలో పోటీపడ్డాయనే చెప్పాలి. ఓటు వేయమని అడగకుండా ప్రత్యర్థిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడానికి ప్రాధాన్యమివ్వడం పరిశీలకుల దృష్టిని దాటిపోలేదు.మొత్తమ్మీద, కార్పొరేషన్ ఎన్నికలు గతంలో ఎరుగని స్థాయిలో వేడి పుట్టిస్తున్నాయి. అభ్యర్థులిద్దరూ తగ్గేదేలే అన్నట్టుగా దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో వారి విజయావకాశాలు పురప్రజల్లో చర్చకు వస్తున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తున్న క్రమంలో ప్రచారాన్ని పీక్స్ కి చేర్చే పనిలో పార్టీలు తలమునకలుగా ఉన్నాయి. ప్రచారానికి చివరి 48 గంటలు కీలకమైనందున ఆదిశగా ఏర్పాట్లు కూడా రహస్యంగా జరిగిపోతున్నాయి. ఎవరి అదృష్టం ఎలావుందో వేచిచూడాలిమరి!