అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
ముమ్మడివరం, మేజర్‌న్యూస్ :- అర్నబ్ తుఫాన్ కారణంగా ప్రాథమిక అంచనా ప్రకారం రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పూర్తిస్థాయి అంచనాల అనంతరం ఈ నష్టం మరింత పెరిగే అవకాశముందన్నారు. తుఫాన్ వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరించామని తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర బృందాలను శుక్రవారం రాష్ట్రానికి పంపనున్నట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారని సీఎం అన్నారు. తుఫాన్ వల్ల ప్రాథమికంగా జరిగిన నష్టానికి సంబంధించిన నివేదికను ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు చెప్పారు. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పర్యటించారు. కోనసీమ జిల్లాలోని వేట్లపాలెంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి, బాధిత రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అలాగే గచ్చకాయలపొర గ్రామంలో పునరావాస శిబిరాన్ని సందర్శించారు. అక్కడ వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. తుఫాన్ బాధితులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. వేట్లపాలెం గ్రామంలో నీట మునిగిన పొలాలను సందర్శించిన స్థానిక రైతులతో మాట్లాడారు. పంటకోతకు మరో 15 రోజులు మాత్రమే సమయం ఉండగా తుఫాన్ రావడంతో తీవ్రంగా నష్టపోయామని, దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పంటల బీమా చేయించారా లేదా అని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీమా సౌకర్యం కల్పించినట్లు అధికారులు వివరించారు. దిగుబడి తగ్గితే బీమా ద్వారా పరిహారం అందుతుందని, రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి వీలైనంత త్వరగా పరిహారం మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న కొబ్బరి చెట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. తుఫాన్ కారణంగా కొబ్బరి చెట్లకు ఉన్న మువ్వ మొత్తం రాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని కొబ్బరి రైతులు వివరించారు. కొబ్బరి చెట్టుకు రూ.1,500, ఆయిల్‌పామ్ చెట్టుకు రూ.1,500 చొప్పున పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
బాధితులకు భరోసా... సమస్యల పరిష్కారానికి ఆదేశాలు
వేట్లపాలెంలో రైతులతో మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి గచ్చకాయలపొర గ్రామంలో తుఫాన్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారికి అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక అధికారులు ముందస్తుగా అప్రమత్తం చేసి తమను సహాయక శిబిరాలకు తరలించారని బాధితులు తెలిపారు. తుఫాన్ కారణంగా తాము నివసిస్తున్న పాకలు కూలిపోయాయని పలువురు మహిళలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పడిపోయిన పాకలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు నిబంధనల ప్రకారం పట్టాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. బోట్లకు రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మత్స్యకారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, రిజిస్ట్రేషన్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పనిచేసిందని ప్రశంసించిన ముఖ్యమంత్రి, అక్కడక్కడా ఉన్న సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే బాధితులకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకుల ప్యాకెట్‌తో పాటు ఖర్చుల కోసం నగదు అందిస్తామని చెప్పారు.
30 వేల మందితో సమన్వయం
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. సుమారు 30 వేల మంది అధికారులను సమాయత్తం చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత మేర తగ్గించడమే లక్ష్యంగా పనిచేశామని చెప్పారు. గతంలో సంభవించిన తుఫాన్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్నారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలు ఎక్కువగా దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు పరిస్థితులను పర్యవేక్షించామని, రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్) ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమన్వయం చేసుకున్నామని వివరించారు. తుఫాన్ కారణంగా కూలిపోయిన చెట్లను తొలగించి రహదారులపై రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. టెక్నాలజీని వినియోగించి చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు. తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లాలోనే సుమారు 8 వేల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి వెయ్యి మంది విద్యుత్ సిబ్బందిని పంపించాలని కోరినట్లు తెలిపారు. అవసరమైతే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా సిబ్బందిని రప్పిస్తామని చెప్పారు. పడిపోయిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించి వీలైనంత త్వరగా సరఫరాను పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు. టెలికమ్యూనికేషన్ వ్యవస్థను కూడా పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు. తుఫాన్లు రావని, ప్రభుత్వం అతిగా జాగ్రత్తలు తీసుకుంటోందని కొందరు విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేపడుతున్న సహాయక చర్యలపైనా రాజకీయంగా మాట్లాడేవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు. ప్రజల రక్షణ, సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు.
దీర్ఘకాల సమస్యలకూ పరిష్కారం
తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు కూడా తన దృష్టికి వచ్చాయని ముఖ్యమంత్రి చెప్పారు. పూడిక పేరుకుపోవడంతో నీరు సముద్రంలోకి వెళ్లక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చేపల వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రకృతి విపత్తుల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన అందించడమే తన లక్ష్యమన్నారు. అర్నబ్ తుఫాన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అదనపు భారాన్ని మోపిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ బాధితులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్‌ను గత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
విద్యుత్ శాఖ సిబ్బందికి సీఎం అభినందన
కాట్రేనికోన మండలంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంలోతుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్ని దగ్గరుండి పరిశీలించారు. చెయ్యేరులో మార్గమధ్యలో కాన్వాయ్ దిగి విద్యుత్ పునరుద్ధరణ పనులు పరిశీలించారు. వీలైనంత వేగంగా మరమ్మతులు చేసి గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు నిరంతరంగా శ్రమిస్తోన్న కార్మికులు, విద్యుత్ శాఖ సిబ్బందిని సీఎం అభినందించారు. ఈ పర్యటనలో మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.