తీన్మార్ మల్లన్న పాదయాత్ర ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి:మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చాట్లపల్లి నర్సింగరావు
శామీర్‌పేట, మేజర్ న్యూస్:బీసీల రాజ్యాధికారం కోసం తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్రలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి చాట్లపల్లి నర్సింగరావు డిమాండ్ చేశారు. ప్రమాదం వెనుక ఎవరి ప్రమేయం ఉందో నిగ్గు తేల్చి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ… తిరుమలగిరి–మోత్కూరు మధ్య అనాజిపురం సమీపంలో పాదయాత్ర సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజ్యాధికారం కోసం సాగుతున్న పాదయాత్రను అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. బీసీలను చైతన్యపరుస్తూ ముందుకు సాగుతున్న పాదయాత్రకు ఆటంకాలు కల్పించడం సరికాదన్నారు.ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్నకు భద్రత పెంచడంతో పాటు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం పోరాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని నర్సింగరావు స్పష్టం చేశారు.