సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు
సిద్దిపేట, ప్రతినిధి ; హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కార్యక్రమాల్లో విశేష కృషి చేసినందుకు సిద్దిపేట జిల్లా ‘సురక్షిత్’ గుర్తింపును సాధించింది. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (టీజీశాక్స్), జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘ఎయిడ్స్ సురక్ష కోసం ప్రజల భాగస్వామ్యం’ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు ఈ గుర్తింపు లభించింది.ఈ సందర్భంగా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంయుక్త సంచాలకురాలు (సీఎస్‌టీ) డాక్టర్ అనురాధ తన్నీరు, ఆమె బృందం జిల్లా కలెక్టర్ కె. హైమావతిని ఘనంగా సత్కరించి, జిల్లా సాధించిన ‘సురక్షిత్’ గుర్తింపుపై అభినందనలు తెలిపారు. ప్రాజెక్టు డైరెక్టర్ కె. విద్యాసాగర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.డాక్టర్ అనురాధ తన్నీరు మాట్లాడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో సిద్దిపేట జిల్లా సాధించిన గుర్తింపు సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం అందించిన సహకారం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, కార్యక్రమ నిర్వహణ అధికారులు, పరీక్షా కేంద్రాల సిబ్బంది, చికిత్సా కేంద్రాల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, సమాజ సహాయక కేంద్రాల సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ మైలురాయిని సాధించగలిగామని తెలిపారు.
నివారణ కార్యక్రమాలపై సమీక్ష..
కార్యక్రమంలో భాగంగా నవంబర్ నెలలో హెచ్‌ఐవీ నివారణ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. వ్యాధి నియంత్రణకు నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధన, చికిత్సకు దూరమైన వారిని తిరిగి గుర్తించి వైద్య సేవల్లోకి తీసుకురావడం, వైరస్ పరిమాణ పరీక్షల నిర్వహణ, లక్ష్యాల సాధనలో ఎదురవుతున్న లోటుపాట్లపై చర్చించారు.
100-100-100 లక్ష్యాల సాధనకు కృషి చేయాలి..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణలో ప్రస్తుతం నిర్దేశించిన లక్ష్యాలతో ఆగిపోకుండా సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి 100-100-100 లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. జిల్లాలో వ్యాధి నివారణ, పరీక్షలు, చికిత్స, వైరస్ నియంత్రణ కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధన్‌రాజ్, కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ నిర్మలా రెడ్డి, సిద్దిపేట చికిత్సా కేంద్ర వైద్యాధికారి డాక్టర్ నాగార్జున, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమ సహాయకుడు మధుబాబు, సహయోగి అశోక్, చికిత్సా కేంద్ర సలహాదారులు, పరీక్షా కేంద్రాల సలహాదారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సమాజ సహాయక కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.