అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన
వెల్దుర్తి, మేజర్ న్యూస్: ప్రజాస్వామ్య పండుగైన ఎన్నికల ప్రక్రియను ప్రజలకు చేరవేసే పాత్రికేయులకు వెల్దుర్తిలోని నామినేషన్ కేంద్రంలో చేదు అనుభవం ఎదురైంది. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన అధికారిక అక్రిడేషన్ కార్డులు చూపించినప్పటికీ, లోపలికి వెళ్లకుండా ఎన్నికల సిబ్బంది అడ్డుకోవడంపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నామినేషన్ల దాఖలు ప్రక్రియను కవర్ చేయడానికి, ఫోటోలు తీయడానికి వెళ్లిన విలేకరులను రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయం వద్దే సిబ్బంది నిలువరించారు. ఎన్నికల కవరేజీకి ప్రత్యేక పాసులు కావాలంటూ నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టించారు. "కలెక్టర్ ఇచ్చిన అక్రిడేషన్ కార్డులకు ఎన్నికల కవరేజీలో విలువ లేదా? సమాచార శాఖ జారీ చేసిన గుర్తింపు కార్డులు దేనికి?" అంటూ పాత్రికేయులు అధికారులను నిలదీశారు.అధికారుల ఏకపక్ష వైఖరి, నిర్లక్ష్యపు సమాధానాలతో విసిగిపోయిన జర్నలిస్టులు నామినేషన్ కేంద్రం వద్ద తమ నిరసనను వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులను గౌరవించాల్సింది పోయి, అవమానించేలా వ్యవహరించడం తగదని పలువురు సీనియర్ పాత్రికేయులు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, పాత్రికేయులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని వెల్దుర్తి మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.