ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు లోని రైతు సేవా కేంద్రంలో శనివారం మండల వ్యవసాయ అధికారి బి. బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు ఎరువుల డీలర్లకు ఎఫ్ ఎఫ్ ఎస్. యాప్ వినియోగంపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. సభలో ఏవో బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ
నవంబర్ 17 నుండి అమల్లోకి వచ్చిన నూతన ఎరువుల బుకింగ్ విధానం గురించి వివరించారు. రైతులు తమ వ్యవసాయదారిని ఐడి లేదా ఆధార్ వివరాలతో ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్‌లో లాగిన్ అయి, పంట మరియు సాగు విస్తీర్ణం ఆధారంగా ఎరువులను ముందస్తుగా బుక్ చేసుకునే విధానాన్ని వివరించారు.
అలాగే రైతులకు యాప్‌లో నమోదు, భూమి వివరాల ఎంపిక, ఎరువుల బుకింగ్, క్యూఆర్ కోడ్ జనరేషన్, టోకెన్ వినియోగం మరియు ఈ -పి ఓ ఎస్ యంత్రం ద్వారా ఎరువుల పంపిణీ చేసే ప్రక్రియపై ప్రాక్టికల్ శిక్షణ అందించారు. ఈ నూతన విధానాన్ని రైతులకు సమర్థవంతంగా చేరవేసి, ఎరువుల పంపిణీలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు ఎరువుల డీలర్లు సమన్వయంతో పనిచేయాలని ఏవో బ్రహ్మారెడ్డి సూచించారు.