రక్తదాన ఉద్యమంలో యువత భాగస్వాములు కావాలి: మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి
కావలి, మేజర్ న్యూస్:
దేశంలో రక్తకొరత నివారణకు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన ఉద్యమంలో భాగస్వాములు కావాలని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కావలి రెడ్ క్రాస్ రక్తకేంద్రంలో 'స్వర్గీయ కాటంరెడ్డి ఆదినారాయణరెడ్డి స్మారక విశిష్ట రక్తదాత అవార్డు' ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.
ఉమ్మడి రాష్ట్రంలో తొలి రెడ్ క్రాస్ రక్తకేంద్రం నెల్లూరులో ఏర్పాటుకు విశేష కృషి చేసి, 83 సార్లు రక్తదానం చేసిన ఐనాల హరనాథ్‌కు ఈ పురస్కారాన్ని విష్ణువర్ధన్‌రెడ్డి చేతుల మీదుగా అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిబిరంలో 30 మంది రక్తదానం చేయగా, విష్ణువర్ధన్‌రెడ్డి 128వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.
అవగాహనతోనే ప్రాణదానం:
సభాధ్యక్షులు, కావలి రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తమ రక్తదాతలను ప్రోత్సహించేందుకు గత ఏడాది ఈ పురస్కారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ, తన తండ్రి ఆదినారాయణరెడ్డి అప్పట్లోనే 60 సార్లకు పైగా రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారని గుర్తుచేశారు. ముఖ్య అతిథి, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ డాక్టర్ కె. మాధవరెడ్డి మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సంస్థలకు ప్రభుత్వాలు మరింత సహకారం అందించాలన్నారు.
నాటి సేవలను గుర్తుచేసుకున్న వక్తలు:
కలరా వ్యాప్తి సమయంలో ఆదినారాయణరెడ్డి ప్రాణాలకు తెగించి పేదలకు, మత్స్యకారులకు చేసిన వైద్యసేవలను అవార్డు గ్రహీత ఐనాల హరనాథ్, నెల్లూరు మాజీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ కొనియాడారు. అటువంటి మహనీయుడి పేరుతో ఉన్న అవార్డు అందుకోవడం తన అదృష్టమని హరనాథ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కావలి రెడ్ క్రాస్ చైర్మన్ డి. రవిప్రకాష్, వైస్ చైర్మన్ కె. హరి నారపరెడ్డి, కోశాధికారి ఆరికట్ల మధుసూదనరావు, పలువురు పాలకమండలి సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.