శ్రీ చండికా దేవికి భక్తిశ్రద్ధలతో సారే సమర్పణ
సూర్య,భీమ్‌గల్ :భీమ్‌గల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాస బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శుక్రవారం క్షేత్రదేవత శ్రీ చండికా దేవి (పెద్దంగంటి ఎల్లమ్మ తల్లి)కి భక్తిశ్రద్ధలతో సారే సమర్పించారు.ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు పట్టణంలోని గ్రామాలయం నుంచి మహిళలు మంగళహారతులు, బాజాభజంత్రీల నడుమ సాంప్రదాయబద్ధంగా సారెను ఊరేగింపుగా తీసుకువచ్చారు. సువాసినులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పాటలు, మంగళహారతులతో ఎల్లమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు.అనంతరం ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నూతన చీర, సారె సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా వైభవంగా జరగాలని, భక్తులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.కార్తీక మాసంలో నిర్వహించే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ముందు క్షేత్రదేవతకు సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ కార్యక్రమం ద్వారా ఆలయ ఉత్సవాలకు ఆధ్యాత్మిక శోభ చేకూరిందని భక్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.