నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ
హైదరాబాద్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు (శుక్రవారం) రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 'భారత్ సమ్మిట్-2026'లో పాల్గొనేందుకు ఆయన విచ్చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఘనస్వాగతం పలకనున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
పర్యటనలో భాగంగా శనివారం (నవంబర్ 14) ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం చట్టం తెచ్చిన నేపథ్యంలో, డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్ల సమస్యలు, వారి సామాజిక భద్రతపై ఆయన స్వయంగా ముఖాముఖి నిర్వహించి అభిప్రాయాలను సేకరించనున్నారు.
అనంతరం రేపు మధ్యాహ్నం హెచ్ఐసీసీలో జరుగుతున్న 'భారత్ సమ్మిట్' ముగింపు వేడుకల్లో రాహుల్ గాంధీ పాల్గొని కీలక ప్రసంగం చేస్తారు. దాదాపు 70 దేశాల నుంచి వచ్చిన 1,000 మందికి పైగా ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులను ఉద్దేశించి ప్రజాస్వామ్యం, ఆర్థిక సహకారం, ప్రపంచ రాజకీయాలపై ఆయన ప్రసంగించనున్నారు. సమ్మిట్ కార్యక్రమం ముగిసిన తర్వాత శనివారం రాత్రి 8 గంటలకు రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో హెచ్ఐసీసీ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.