ప్రజాసేవకు జాతీయ పురస్కార కిరీటం.. గాయనిగా రాణిస్తున్న పంచాయతీ కార్యదర్శి బల్లూరి శోభారాణికి అంబేద్కర్ అవార్డు
బొంరాస్ పేట్, మేజర్ న్యూస్: ప్రజాసేవలో అంకితభావం.. విధి నిర్వహణలో నిబద్ధత.. కళారంగంలో విశేష ప్రతిభ.. ఇలా విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్న బల్లూరి శోభారాణికి అరుదైన జాతీయ గౌరవం దక్కింది. బొంరాస్ పేట్ మండలం నాందాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆమె ప్రతిష్ఠాత్మక డా. బి.ఆర్. అంబేద్కర్ జాతీయ పురస్కారం–2026కు ఎంపికయ్యారు.బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అందించే ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి శోభారాణిని ఎంపిక చేసినట్లు అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ ప్రకటించారు. పంచాయతీ కార్యదర్శిగా ప్రభుత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామీణ ప్రజలకు సేవలందించడంలో చూపుతున్న అంకితభావంతో పాటు, గాయనిగా కళారంగంలో ప్రదర్శిస్తున్న ప్రతిభను గుర్తించి ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.ఈ నెల 15న న్యూఢిల్లీలో నిర్వహించనున్న బహుజన సాహిత్య అకాడమీ 20వ జాతీయ సదస్సులో శోభారాణికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు అకాడమీ ఎంపిక లేఖను సైతం జారీ చేసింది.ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తనలోని కళాతృష్ణను సజీవంగా ఉంచుకుంటూ గాయనిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. వృత్తి జీవితాన్ని, కళారంగాన్ని సమన్వయం చేసుకుంటూ రెండు రంగాల్లోనూ రాణించడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపిక కావడం నాందాపూర్ గ్రామంతో పాటు బొంరాస్ పేట్ మండలానికి గర్వకారణంగా నిలిచింది.ప్రజలకు సేవలందిస్తూనే కళారంగంలో తన ప్రతిభను చాటుకొని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బల్లూరి శోభారాణి మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె అంబేద్కర్ జాతీయ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.