కళ్యాణదుర్గం పట్టణంలో పసుపు సందడి.. విజయోత్సవ ర్యాలీకి సర్వం సిద్ధం
కళ్యాణదుర్గం మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ విజయోత్సవ ర్యాలీకి సర్వం సిద్ధం చేశాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో పాటు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.
ఈ విజయంతో నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుతమ్ముళ్లలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ర్యాలీని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలతో నిండిపోయాయి.
మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఈ భారీ ర్యాలీతో కళ్యాణదుర్గం పట్టణం పూర్తిగా పసుపుమయం కానుంది. డప్పు వాయిద్యాలు, బాణసంచా పేలుళ్లు, కార్యకర్తల జయజయధ్వానాల మధ్య పట్టణ పురవీధుల గుండా ఈ విజయోత్సవ ప్రదర్శన సాగనుంది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు కళ్యాణదుర్గానికి తరలివస్తున్నారు.
రిపోర్టర్ : సుధా మోహన్ కళ్యాణదుర్గం ఇన్చార్జ్ మేజర్ న్యూస్.