మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్.. ఔట్లుక్, టీమ్స్ సేవలకు భారీ అంతరాయం
సూర్య టెక్నాలజీ డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్ సేవల్లో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులను మైక్రోసాఫ్ట్ 365, ఔట్లుక్ (Outlook) మరియు మైక్రోసాఫ్ట్ టీమ్స్ (Teams) సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడం కలకలం సృష్టించింది. ప్రధానంగా అమెరికాతో పాటు పలు దేశాల్లో ఈ గ్లోబల్ అవుటేజ్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఉదయం నుంచి వందలాది మంది యూజర్లు తమ ఇన్‌బాక్స్‌లను యాక్సెస్ చేయలేకపోవడం, మెయిల్స్ పంపడంలో, స్వీకరించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆన్‌లైన్ డౌన్‌డిటెక్టర్ ప్లాట్‌ఫారమ్‌లో భారీగా ఫిర్యాదులు చేశారు.
ఈ సాంకేతిక వైఫల్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది వ్యాపార సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు మరియు విద్యాసంస్థల దైనందిన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఔట్లుక్‌తో పాటు వన్‌డ్రైవ్, కోపైలట్ (Copilot) మరియు మైక్రోసాఫ్ట్ స్టోర్ సేవలు కూడా మందగించినట్లు యూజర్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఓపెన్ ఏఐ (OpenAI), ఆంత్రోపిక్ (Anthropic) వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థల ఏఐ సర్వీసులకు అనుసంధానంగా ఉన్న మైక్రోసాఫ్ట్ కనెక్టర్లు సైతం ఈ అంతరాయం బారిన పడ్డట్లు టెక్ నిపుణులు తెలిపారు.
సమస్య తీవ్రతను గుర్తించిన మైక్రోసాఫ్ట్ ఇంజనీరింగ్ బృందాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ప్రభావితమైన సర్వర్లపై అధిక భారాన్ని తగ్గించేందుకు అత్యవసరంగా ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మౌలిక వసతులకు మళ్లించే చర్యలు చేపట్టాయి. కొన్ని సర్వర్లను పునఃప్రారంభించడం (restarting affected servers) ద్వారా సేవలను దశలవారీగా పునరుద్ధరిస్తున్నామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. క్లౌడ్ ఆధారిత డిజిటల్ సేవలు ఒకేసారి ఇలా స్తంభించిపోవడం కార్పొరేట్ వర్గాల్లో భద్రత మరియు సర్వర్ల స్థిరత్వంపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.