కట్టంగూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య లక్ష్యాలకు బ్రేక్ --పీహెచ్‌సీ పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏదీ?
ఏడు నెలల ప్రగతి నివేదికలో వెలుగులోకి వచ్చిన గణాంకాలు – హైపర్‌టెన్షన్, డయాబెటిస్ పరీక్షల్లో వెనుకబాటు
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలు ఆశించిన స్థాయిలో లేదని అధికారిక ప్రగతి నివేదిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్ 2026 నుంచి అక్టోబర్ 2026 వరకు నమోదైన వివరాలను పరిశీలిస్తే పలు ఆరోగ్య కార్యక్రమాల్లో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబాటు కనిపిస్తోంది.
ముఖ్యంగా హైపర్‌టెన్షన్ పరీక్షల్లో 6,090 మందిని పరీక్షించాలని లక్ష్యంగా నిర్ణయించగా, 2,695 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారు. డయాబెటిస్ పరీక్షల్లో 3,045 లక్ష్యానికి గాను 1,740 మందికి మాత్రమే పరీక్షలు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.
అదేవిధంగా గర్భిణుల నమోదు కార్యక్రమంలో 504 లక్ష్యానికి గాను 421 మాత్రమే నమోదయ్యారు. ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య కూడా 455 లక్ష్యానికి గాను 325 మాత్రమే నమోదైంది.
చిన్నారులకు అందించే టీకాల కార్యక్రమంలోనూ లక్ష్యాలకు, సాధించిన ఫలితాలకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. బీసీజీ టీకాలు 455 లక్ష్యానికి గాను 325 మందికి మాత్రమే అందించారు.
ట్యూబర్‌క్యులోసిస్ (టీబీ) కార్యక్రమంలో 26 కేసులు నమోదవగా, ఇతర ఆరోగ్య కార్యక్రమాల అమలుపై కూడా నివేదిక పలు వివరాలను వెల్లడించింది.
అధికారుల పర్యవేక్షణ అవసరం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పలు కార్యక్రమాలు లక్ష్యాలకు దూరంగా ఉండటంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది పనితీరును సమీక్షించి, మిగిలిన లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.