సీఎం అండతోనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అరాచకాలు: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరోపణ
సూర్య మంచిర్యాల టౌన్ : జిల్లాలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గం,మంత్రి వివేక్ వర్గం మధ్య జరుగుతున్న దాడులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఆరోపించారు.ఈ అంశంపై ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతోనే మంచిర్యాలలో అరాచకాలు జరుగుతున్నాయని విమర్శించారు.గత మూడేళ్లుగా జిల్లాలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారులపై దాడులు జరుగుతున్నా, అక్రమ కేసులు నమోదవుతున్నా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.యువతను గంజాయి, డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తూ దాడులను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేశారు.మంచిర్యాలలో భూకబ్జాలు, దాడులు, వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు దిగడంతో ప్రశాంతంగా ఉన్న మంచిర్యాలలో అశాంతి నెలకొందన్నారు.గత వారం రోజులుగా ఒక వ్యక్తికి సుమారు 300 మంది పోలీసులతో భద్రత కల్పించడంపై ప్రశ్నలు లేవనెత్తిన రఘునాథ్ వెరబెల్లి, ఇంత భారీగా పోలీసు బలగాలను ఎవరి ఆదేశాలతో మోహరించారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులపై తక్షణమే చర్యలు తీసుకుని జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.