telangana
సత్వరమే ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్వయంగా ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను అధికారులు తక్షణమే పరిష్కరించాలని, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు సత్వర న్యాయం అందించాలన్నారు. ఈ ప్రజావాణిలో విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూసమస్యలు, ఇతర సమస్యలకు సంబంధించి జిల్లా, మండల స్థాయిల్లో 66 ఫిర్యాదులు, వినతులను రావడం జరిగిందని వెల్లడించారు.ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ అధికారులతో జల, విద్యుత్ సంరక్షణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నీటి సంరక్షణ, విద్యుత్ ఆదా అంశాలపై అన్ని శాఖల అధికారులు, ప్రైవేట్ నివాసాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, జీపీ భవనాలు, ప్రైవేట్ రెసిడెన్షియల్స్‌లో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. పీఎం సూర్యఘర్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 3 కిలోవాట్ల సిస్టమ్‌కు రూ. 78,000 వరకు సబ్సిడీతో పాటు బ్యాంక్ లోన్ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ నిధులను వెచ్చించేటప్పుడు ప్రథమ ప్రాధాన్యత తాగునీరు, ఆ తర్వాత శానిటేషన్, వాటర్ కన్జర్వేషన్, ఎనర్జీ కన్జర్వేషన్ పనులకు కేటాయించాలని స్పష్టం చేశారు. తగిన అనుమతులు లేకుండా కొత్త బోర్వెల్స్ తవ్వరాదని, బోరుబావులు, రూఫ్‌టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ల ఏర్పాటును తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. వాహనాలు కడగడానికి పైపులు వాడకుండా, తడి గుడ్డను ఉపయోగించి నీటి వృధాను అరికట్టాలని, అలాగే వృధా అయ్యే నీటిని గార్డెనింగ్‌కు మళ్లించాలని సూచించారు. కార్యాలయాల్లో ఏసీ ఉష్ణోగ్రతలను 24 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి కార్యాలయంలో నీటి, విద్యుత్ సంరక్షణ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, ఎస్.రాజేశ్వర్, డిఆర్ఓ స్రవంతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.