telangana
గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు కొమురం భీమ్ - మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : గిరిజన హక్కుల పరిరక్షణ కోసం నిరంకుశ పాలనకు, దోపిడీకి, అన్యాయానికి ఎదురుండి పోరాడిన ఆదివాసీ వీరుడు కొమురం భీమ్ అని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ అన్నారు.ఆదివాసీలు విద్య, వ్యాపార, వైద్య మరియు రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించి, అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అప్పుడే ఆయన ఆశయాలు నెరవేరుతాయని తెలియజేయడం జరిగింది.కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “జల్ – జంగల్ – జమీన్” అనే నినాదంతో ఆదివాసీలకు నీరు, అడవి, భూమిపై హక్కులు ఉండాలని నినదించిన కొమురం భీమ్ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. గిరిజనుల ఆత్మగౌరవం, స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. తన జీవితాన్నే గిరిజన సమాజ హక్కుల కోసం అంకితం చేసిన కొమురం భీమ్ త్యాగం ప్రతి ఒక్కరిలో సామాజిక న్యాయం పట్ల నిబద్ధతను పెంపొందిస్తుందని తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలను గౌరవిస్తూ వారి హక్కులను కాపాడుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కొమురం భీమ్ ఆశయాలను స్మరించుకోవడం అంటే ఆయనకు నివాళులర్పించడం మాత్రమే కాకుండా, గిరిజనుల అభివృద్ధి, ఆత్మగౌరవం, సమాన హక్కుల సాధనకు కృషి చేయడమని బండారి అనూష సతీష్ అన్నారు. ఆదివాసీ వీరుడు కొమురం భీమ్ చూపిన పోరాట మార్గం, ఆయన త్యాగనిరతి, జల్ – జంగల్ – జమీన్ నినాదం తరతరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పేర్కొన్నారు.