రాష్ట్ర ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పెట్టుబడుల ప్రోత్సాహం – యువతకు ఉపాధి అవకాశాల కల్పన : రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డా. వై. యువరాజ్
తిరుపతి, మేజర్‌న్యూస్ :
శ్రీ సిటీ, అక్టోబర్ 26: 31 వ సిఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా తిరుపతి ప్రాంతీయ సదస్సు నిర్వహణ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఇందులో రూ. రూ.11,731.68 కోట్ల పెట్టుబడులతో 67 పారిశ్రామిక ఒప్పందాలు కుదిరాయని, ఈ సదస్సుతో రాష్ట్రం లో నిర్వహించిన ఐదు ప్రాంతీయ సదస్సులు విజయవంతంగా ముగిశాయని రాష్ట్ర యువజన అడ్వాన్స్మెంట్, పర్యాటకం మరియు సంస్కృతి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ పేర్కొన్నారు.
సోమవారం శ్రీసిటీ లోని క్రియా యూనివర్సిటీలోని ఆడిటోరియంలో తిరుపతి ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఏపి యువజన అడ్వాన్స్మెంట్, పర్యాటకం మరియు సంస్కృతి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, ఏ పి పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ కార్యదర్శి డా.వై.యువరాజ్, ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫర్ ప్రాసెసింగ్ ఏపి చిరంజీవి చౌదరి, ఏ పి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సిఈఓ సగిలి షన్మోహన్, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభమ్ బన్సల్, ఏపీఐఐసీ విసి & ఎండి ఎఎస్.దినేష్ కుమార్, ఏపీటీడీసీ ఎండీ పట్టాంశెట్టి రవి సుభాష్, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యశ్వంత్ రెడ్డి, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సిఈఓ శేఖర్ బాబు గెడ్డమ్, ఏపీఎంఎస్ఎండీసీ సీఈఓ విశ్వ మనోహరన్, శ్రీ సిటీ చైర్మన్ సి.శ్రీనివాస రాజు, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఎపిఎంఎస్ఎంఈడిసి సిఈఓ విశ్వ మనోహరన్, పెట్టుబడిదారులు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆడిటోరియం సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ (ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త) స్టాల్స్ ను ముఖ్య అతిథులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యువజన అడ్వాన్స్మెంట్, పర్యాటకం మరియు సంస్కృతి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ మాట్లాడుతూ . . . రాష్ట్రంలో ప్రాంతీయంగా పెట్టుబడులను ప్రోత్సహించడం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఐదు ప్రాంతీయ సదస్సులు విజయవంతంగా ముగిశాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు పారిశ్రామిక పెట్టుబడులను విస్తరించి, స్థానిక వనరులు, వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. 31వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌కు ముందు నిర్వహించిన ఐదు ప్రాంతీయ సదస్సుల్లో చివరిదైన సమావేశాన్ని శ్రీసిటీలో విజయవంతంగా నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. శ్రీసిటీ, శ్రీకాళహస్తి ప్రాంతాలకు పారిశ్రామికంగా విశేష ప్రాధాన్యత ఉందని, ఎంఎస్ఎంఈల అభివృద్ధి, స్థానిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, పెద్ద పరిశ్రమలతో అనుసంధానం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించవచ్చని తెలిపారు. శ్రీసిటీలో నిర్వహించిన సదస్సులో 21 ఎంఎస్ఎంఈ సంస్థలు పాల్గొన్నాయని పేర్కొన్నారు. నూతన పారిశ్రామిక విధానాలు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విశాఖపట్నంలో 2026 నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలు, పారిశ్రామిక అవకాశాలను తీసుకువచ్చే వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సంబంధిత రంగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో భాగంగా ఎం ఎస్ ఎం ఈ బ్యాంకింగ్ గ్రీవెన్స్ రిడ్రసెల్ మెకానిజం పోర్టల్ ను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా సోమవారం శ్రీ సిటీలోని క్రియా యూనివర్సిటీలో నిర్వహించిన ఐదవ, చివరి ప్రాంతీయ సదస్సులో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలకు సంబంధించి మొత్తం 67 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయి. వీటి ద్వారా రూ.11,731.68 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండగా, 20,879 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇందులో ఆయా ప్రాంతీయ జిల్లాల్లో ఏర్పాటు కానున్న 50 ప్రాజెక్టులకు సంబంధించి రూ.7,380.68 కోట్ల పెట్టుబడులతో 16,612 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. వీటిలో 18 ప్రాజెక్టులు ఒక్క శ్రీ సిటీలోనే ఏర్పాటు కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ కార్యదర్శి డా. వై. యువరాజ్ మాట్లాడుతూ . . . ప్రాంతీయంగా పెట్టుబడులను ప్రోత్సహించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” సూత్రం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించి, ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టనున్నామన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని తగ్గించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టి సారించనున్నామన్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ప్రధాన ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతో పాటు పారిశ్రామిక మౌలిక సదుపాయాలను విస్తరించి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నామన్నారు. వైజాగ్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధితో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించనున్నారు. హైస్పీడ్ రైలు, బుల్లెట్ రైలు మార్గాల ప్రతిపాదనలు, జాతీయ రహదారుల విస్తరణ, భోగాపురం విమానాశ్రయం, శ్రీసిటీ ప్రాంతానికి విమానయాన అనుసంధానం వంటి అంశాల ద్వారా రవాణా, లాజిస్టిక్స్ రంగాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. యువత నైపుణ్యాభివృద్ధి, స్థానిక వనరుల వినియోగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, ప్రజల్లో పారిశ్రామిక అవకాశాలపై అవగాహన పెంపొందించడం ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను విస్తరించి రాష్ట్ర సమగ్ర ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” లక్ష్యంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్రంలోని 175 పార్కుల్లో 153 పార్కుల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. తిరుపతి సహా ఐదు జిల్లాల్లో మొత్తం 31 ఎంఎస్ఎంఈ పార్కులు ఉండగా, సుమారు 2,053 ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. జూన్ 2024 నుంచి ఈ ప్రాంతంలో 914 ఎకరాల భూమిని ఎంఎస్ఎంఈలకు కేటాయించగా, రూ.3,885 కోట్ల పెట్టుబడులు, 41,622 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడిందన్నారు.
కెవిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆముదవల్లి రంగనాథన్ మాట్లాడుతూ . . . ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా పండ్లను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటని, అయినప్పటికీ మదనపల్లె ప్రాంతంలో టమోటా రైతులు పంట ఉత్పత్తులకు గిట్టుబాటు మార్కెట్ ధరలు లేక ఇబ్బంది పడుతున్నారని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు వ్యవసాయ క్షేత్రం నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు బలమైన సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. తిరుపతి ప్రాంతంలో టమోటా, డైరీ, లాజిస్టిక్స్ రంగాలకు అనుకూలమైన వనరులు ఉన్నాయని, శ్రీసిటీలోని మోండెలెజ్, పెప్సికో, కెల్లగ్స్ వంటి అంతర్జాతీయ సంస్థలకు అవసరమైన ముడి పదార్థాలు, ప్యాకేజింగ్, ఇతర సేవలను అందించడం ద్వారా చిన్న పారిశ్రామికవేత్తలు కూడా అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. మామిడి గుజ్జు, టమోటా పేస్ట్, పౌడర్, పాల ఉత్పత్తులు, చిరుతిళ్లు, రెడీ-టు-కుక్ ఆహారాల తయారీతో పాటు కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్, ప్యాకేజింగ్ యూనిట్ల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద పరిశ్రమలకు అందిస్తున్న రాయితీలు, క్యాపిటల్ సబ్సిడీలను పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు, ఎఫ్పీఓలు, స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలకు ప్రత్యేక మద్దతు అందించడం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చన్నారు.
ఇండియా మెటల్ వన్ స్టీల్ ప్లేట్ ప్రాసెసింగ్ (IMOP) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టైజో ఇవామి మాట్లాడుతూ . . ., జపాన్‌కు చెందిన తమ సంస్థ శ్రీసిటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీసిటీ యాజమాన్యం అందిస్తున్న సహకారంతో విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. కోబెల్కో, హిటాచి, కొమట్సు, ఎక్స్సీఎంజీ వంటి ప్రముఖ నిర్మాణ పరికరాల తయారీ సంస్థలకు అవసరమైన ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ ఉత్పత్తులను తయారు చేస్తూ, అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీసిటీలో 2011లో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించి, 2012లో ఉత్పత్తిని మొదలుపెట్టామని, అనంతరం 2019, 2022లో విస్తరణ చేపట్టినట్లు వివరించారు. ప్రారంభంలో రూ.20 కోట్లుగా ఉన్న పెట్టుబడులు ప్రస్తుతం రూ.400 కోట్లకు చేరాయని, సంస్థ ఆదాయం రూ.250 కోట్ల నుంచి రూ.800 కోట్లకు పెరుగుతోందని తెలిపారు. ఉద్యోగుల సంఖ్య 130 నుంచి 800కు పెరిగిందని, మార్చి 2027 నాటికి 1,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందులో 75 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రెండో ప్లాంట్‌లో నవంబర్ 2026 నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపారు. చెన్నైకి సమీపంలో 8,500 ఎకరాల్లో విస్తరించిన శ్రీసిటీలో ప్రత్యేక ఆర్థిక మండలి, ఫ్రీ ట్రేడ్ జోన్, వేర్‌హౌసింగ్, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ వంటి సదుపాయాలు ఒకే చోట అందుబాటులో ఉన్నాయని టైజో ఇవామి పేర్కొన్నారు. సుమారు 31 దేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వేగవంతమైన సింగిల్ డెస్క్ అనుమతులు, నమ్మకమైన విద్యుత్ సరఫరా, నైపుణ్యం కలిగిన మానవ వనరులు పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. తమ సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీసిటీ యాజమాన్యం, భాగస్వాములకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సీఐఐ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ డా. జి. సాంబశివరావు మాట్లాడుతూ. . . శ్రీసిటీలో నిర్వహించిన సమావేశంలో తిరుపతి ప్రాంతంలోని వ్యాపార అవకాశాలు, ఆధునిక తయారీ సాంకేతికత, విజ్ఞాన ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై చర్చించామన్నారు. స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధితో పాటు యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. పర్యాటకం, ఆతిథ్య రంగం, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, అధునాతన పదార్థాలు, ఆటోమోటివ్, అంతరిక్షం, పాదరక్షల తయారీ వంటి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ మారకద్రవ్య ఆర్జనకు దోహదపడవచ్చన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుమారు 1,053 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకొని ఓడల నిర్మాణం, మరమ్మతులు, నౌకాశ్రయాల ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించవచ్చని వివరించారు. వ్యవసాయ రంగంలో కూరగాయలు, పండ్లు, సేంద్రీయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచవచ్చన్నారు. పరిశ్రమలు, ప్రభుత్వం, స్థానిక పారిశ్రామికవేత్తలు సమన్వయంతో పనిచేస్తూ అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.
క్రియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిర్మలా రావు మాట్లాడుతూ . . . 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో క్రియా విశ్వవిద్యాలయం ఏర్పాటైందని తెలిపారు. మానవిక, ప్రాకృతిక, సామాజిక శాస్త్రాలను అనుసంధానించే అంతర విభాగ విద్య ద్వారా విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచన, సమస్యల పరిష్కారం, నైతిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సమర్థవంతమైన సమాచార నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బిజినెస్ విద్యకు, లిబరల్ ఆర్ట్స్ విద్యకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ, విద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచే ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమల ఆధారిత అనుభవాలను అందిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు మారుతున్న ఉద్యోగావకాశాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా, వివిధ రంగాల్లో సమర్థంగా పనిచేసేలా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. తమ విద్యార్థుల్లో సుమారు 25 నుంచి 30 శాతం మంది టెక్నాలజీ, డిజిటల్ రంగాలు, కార్పొరేట్ వ్యూహరచన, మార్కెటింగ్, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగావకాశాలు పొందుతున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలను పెంపొందించే దిశగా ఆక్స్ఫర్డ్, న్యూయార్క్ విశ్వవిద్యాలయం (NYU), జాన్స్ హాప్కిన్స్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలతో క్రియా భాగస్వామ్యాలు కలిగి ఉందన్నారు. విద్యార్థులకు సమగ్ర విద్యను అందిస్తూ, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ సందీప్ దావు మాట్లాడుతూ . . . ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న ఆలస్య చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ కొరత, వృద్ధికి అవసరమైన పెట్టుబడుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. పరిశ్రమల్లో నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పారిశ్రామిక విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో అమలవుతున్న RAMP (Raising and Accelerating MSME Performance) కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎంఈల సామర్థ్యాన్ని పెంపొందించడం, రుణ సదుపాయాలు, మార్కెట్ మద్దతు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర ప్యాకేజింగ్, బ్రాండింగ్ వంటి అంశాలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్, జెడ్ (ZED) పథకం, మేధో సంపత్తి హక్కులు (IPR), వ్యాపార అభివృద్ధి సేవల ద్వారా సూక్ష్మ, చిన్న పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంఎస్ఎంఈలకు సకాలంలో చెల్లింపులు అందేలా ఆన్లైన్ వివాద పరిష్కార వ్యవస్థ (ODR), మధ్యవర్తిత్వ ప్రక్రియలను బలోపేతం చేస్తున్నామన్నారు. అలాగే, ట్రేడ్స్ (TReDS) వేదిక ద్వారా ఇన్వాయిస్లను నగదుగా మార్చుకొని వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చుకోవచ్చని తెలిపారు. గత నాలుగైదేళ్లలో ఈ వేదిక ద్వారా లావాదేవీల విలువ రూ.40,000 కోట్ల నుంచి రూ.3.5 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఎంఎస్ఎంఈలకు ఈక్విటీ పెట్టుబడులు అందించేందుకు ఏర్పాటు చేసిన సెల్ఫ్ రిలయంట్ ఇండియా (SRI) ఫండ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లు కేటాయించిందని, దీని ద్వారా ఇప్పటివరకు 824కు పైగా సంస్థలకు సుమారు రూ.21,300 కోట్ల ఈక్విటీ మద్దతు లభించిందని సందీప్ దావు తెలిపారు. దేశవ్యాప్తంగా తయారీ, సేవలు, వాణిజ్య రంగాల్లోని ఎంఎస్ఎంఈలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని, స్థిరమైన వృద్ధి సాధించాలని ఆయన సూచించారు.
తిరుపతి ప్రాంతీయ సదస్సులో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఆటోమొబైల్ విడిభాగాలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ, పాదరక్షల తయారీ, పర్యాటకం, ఆతిథ్య రంగం, ఆహార శుద్ధి, ఔషధ పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, రీసైక్లింగ్, లాజిస్టిక్స్, ఐటీ వంటి రంగాలకు ప్రాధాన్యం లభించింది. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగంలో ఆరు ఒప్పందాల ద్వారా రూ.2,105 కోట్ల పెట్టుబడులు, 4,540 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. ఆటో విడిభాగాలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాల్లో ఐదు ఒప్పందాల ద్వారా రూ.1,600 కోట్ల పెట్టుబడులు, 2,250 ఉద్యోగాలు, పాదరక్షల తయారీ రంగంలో రూ.700 కోట్ల పెట్టుబడితో 3,000 ఉద్యోగాల కల్పనకు ప్రతిపాదనలు వచ్చాయి. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో అత్యధికంగా 22 ఒప్పందాల ద్వారా రూ.1,538 కోట్ల పెట్టుబడులు, 2,812 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. అలాగే ఆహార శుద్ధి రంగంలో తొమ్మిది ఒప్పందాల ద్వారా రూ.1,096 కోట్ల పెట్టుబడులతో 2,130 ఉద్యోగాలు కల్పించే అవకాశముంది.
తిరుపతి, చిత్తూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన 21 ఎంఎస్ఎంఈ సంస్థలు సదస్సులో నిర్వహించిన ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ప్యాకేజింగ్, పారిశ్రామిక పరికరాలు, ఆటోమేషన్, రోబోటిక్స్, వ్యవసాయ ఉత్పత్తులు, చిరుధాన్యాలు, మూలికా ఉత్పత్తులు, హస్తకళలు, గ్రామీణ పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత సేవలు వంటి విభిన్న రంగాల ఉత్పత్తులు ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి.
రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను పరిశ్రమల స్థాపన, ఉత్పత్తి ప్రారంభం వరకు నిరంతరం పర్యవేక్షించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. జూన్ 2024 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రూ.22.6 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టులు ప్రతిపాదనల దశలో ఉండగా, వీటి ద్వారా 19.3 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. ఇందులో 496 ప్రాజెక్టులకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కాగా, రూ.5.9 లక్షల కోట్ల విలువైన 267 ప్రాజెక్టులు ఇప్పటికే కార్యరూపం దాల్చాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రాంతీయ సదస్సులో పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌కు ముందు నిర్వహించిన ఈ ఐదు ప్రాంతీయ సదస్సులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెట్టుబడుల అవకాశాలను జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వర్గాలకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించాయి.